నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్‌కు రైల్వే లైన్ ఏర్పాటైతే జిల్లావాసులు వాణిజ్య, విద్య, వ్యవసాయ పనుల కోసం ఆదిలాబాద్, మహారాష్ట్రలోని నాగ్పూర్, ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి సౌలభ్యంగా ఉంటుంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో రూ. 2800 కోట్లతో చేపడతామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అయితే పనులు చేయడం లేదని రాష్ట్ర ప్రజాప్రతినిధులు, రాష్ట్రం ముందుకు రావడం లేదని రైల్వే అధికారులు చెప్పుకుంటూ ఉండటం వల్ల పనులు ప్రారంభం కావడం లేదు. రైలు మార్గం మంజూరు తర్వాత కేవలం సర్వే మాత్రమే చేసి రైల్వే అధికారులు సరిపెట్టారు.
సర్కారే ముందుకు రావడం లేదు..
గతంలో ఆదిలాబాద్-పటాన్ చెరు రైలు మార్గం ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. సుమారు రూ. 3 వేల 700 కోట్ల వ్యయంతో 317 కిలోమీటర్ల మార్గం ఏర్పాటు చేయాలని భావించినా... నిధుల కేటాయింపులో జాప్యంతో ఆ ప్రాజెక్టు మరుగున పడిపోయింది. ఈలోపు నిజామాబాద్పెద్దపల్లి లైన్పూర్తయి రైళ్లు నడుస్తుండగా... మళ్లీ ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ డిమాండ్ ముదుకొచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసే రైలు మార్గాలకు ఖర్చుల్లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించాల్సి ఉంటుంది. ఆర్మూర్-ఆదిలాబాద్ రైలు మార్గం వ్యయంలో సగం వరకు భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రెండేళ్ల కిందటే మంత్రులు రైల్వే మంత్రికి వివరించారు. అయినా పనులు మాత్రం మొదలవ్వలేదు. రాష్ట్ర సర్కారే ముందుకు రావడంలేదని.. మరోసారి ప్రభుత్వంతో చర్చిస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానంద్ మాల్యా పేర్కొన్నారు.