తెలంగాణ

telangana

ETV Bharat / state

Nizamabad City Buses: విస్తరిస్తోన్న నిజామాబాద్... సిటీ బస్సులు నడపాలని విజ్ఞప్తులు

నిజామాబాద్‌... ప్రస్తుత మేటి నగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతోంది. నలువైపులా విస్తరిస్తోంది. అలాంటి నగరంలో ప్రయాణం ఖరీదైనదిగా మారింది. ప్రజా రవాణా అందుబాటులో లేక ఆటోల్లో అడిగినంత ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. సిటీ బస్సులు నడపాలనే డిమాండ్‌ పెరగుతోంది. ఇటీవలే ఆర్టీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జిల్లా నేత బాజిరెడ్డి గోవర్ధన్‌ చొరవ చూపాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Nizamabad
నిజామాబాద్

By

Published : Oct 31, 2021, 6:24 PM IST

Updated : Oct 31, 2021, 11:04 PM IST

Nizamabad City Buses: విస్తరిస్తోన్న నిజామాబాద్... సిటీ బస్సులు నడపాలని విజ్ఞప్తులు

ఇందూరు నగరం అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. మున్సిపాలిటీ స్థాయి నుంచి కార్పొరేషన్‌గా ఎదిగింది. నగరానికి అతి దగ్గరగా సుమారు 70కి పైగా గ్రామాలున్నాయి. వివిధ పనుల నిమిత్తం అక్కడ నుంచి నిత్యం వందలాది మంది వస్తుంటారు. నగరంలో సిటీ బస్సులు నడపాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవటంతో అమలు జరగడంలేదు. ఇటీవల నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు ఆర్టీసీ ఛైర్మన్ పదవి చేపట్టడటంతో నగరవాసుల్లో సిటీ బస్సులపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.

భారీగా పెరిగిన ధరలు...

నిజామాబాద్ నగరంలో తిరగాలంటే సొంత వాహనం ఉండాలి లేదా ఆటోలో వెళ్లాలి. ఇటీవల ఆటో ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. ఒక్కొక్కరికి 20 నుంచి 50వరకు వసూలు చేస్తున్నారు. రాత్రి వేళ్లల్లో ఏకంగా 150 వరకు డిమాండ్ చేస్తున్నారు. ఫలితంగా నగరానికి వచ్చే ప్రజలతోపాటు విద్యార్థులపై భారం పడుతోంది. సిటీ బస్సులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. టికెట్ ధరలు అందుబాటులో ఉండటంతోపాటు సురక్షితం ప్రయాణమని భావిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులతోపాటు విద్యార్థులు సైతం బస్సులు నడపాలని కోరుతున్నారు.

నిజామాబాద్ బస్టాండ్

మళ్లీ సిటీ బస్సులు తీసుకురండి...

నిజామాబాద్‌ ఆర్టీసీ బస్టాండ్ నుంచి నగరం నలువైపులా సిటీ బస్సులను నడిపేందుకు అవకాశం ఉంది. బస్టాండ్ నుంచి కంఠేశ్వర్ మీదుగా దాస్‌నగర్‌ వరకు, పులాంగ్ నుంచి వినాయక్‌నగర్ వరకు నడపొచ్చు. ఆర్యనగర్ మీదుగా మాధవనగర్, వర్ని రోడ్ మీదుగా నాగారం, మల్లారం డెంటల్ కళాశాల వరకు సేవలు అందించవచ్చు. బోధన్ బస్టాండ్ నుంచి అర్సపల్లి మీదుగా సారంగాపూర్ వరకు బస్సులను నడిపేందుకు అవకాశం ఉంది. అవసరమైతే నుడా పరిధిలో గ్రామాల మీదుగానూ సిటీ బస్సులను తిప్పవచ్చు. గతంలో ఇందూర్ చిన్న పట్టణంగా ఉన్నప్పుడే సిటీ బస్సులను నడిపారు. అయితే నష్టాలు వస్తున్నాయని నిలిపివేశారు. ప్రస్తుతం జనాభా పెరగడం, సిటీ విస్తరించిన నేపథ్యంలో మళ్లీ సిటీ బస్సులు తీసుకురావాలని అభిప్రాయపడుతున్నారు. ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక చొరవ తీసుకుని నిజామాబాద్‌లో సిటీ బస్సులు నడిపే అంశం పరిశీలించాలని నగరవాసులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:

Last Updated : Oct 31, 2021, 11:04 PM IST

ABOUT THE AUTHOR

...view details