Nizamabad Government Hospital: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగిని లాక్కెళ్లిన ఘటనపై విచారణ పూర్తయింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు డీఏంఈ రమేశ్ రెడ్డి ఇద్దరు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగింది. కమిటీ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇద్దరు ప్రొఫెసర్ల కమిటీ సభ్యులు ఆసుపత్రి వర్గాలతో చర్చించారు. ఈ నెల 15న ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిని నేలపై ఈడ్చుకెళ్లినట్లు బయటకి వచ్చిన వీడియోలను కమిటీ సభ్యులు పరిశీలించారు.
రిపోర్ట్ ఎవరికి ఇవ్వనున్నారు: రోగికి సంబంధించి వివరాలపై డీఎంఈ తనిఖీ బృందం ఆసుపత్రి సిబ్బందిని అడిగి సమాచారం తెలుసుకున్నారు. డాక్టర్ రత్నకుమారి, డాక్టర్ ఇద్రీస్ ఖాన్ ఆదిలాబాద్ మెడికల్ కళాశాల నుంచి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆసుపత్రిలో కలియతిరిగారు. ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. విచారణ చేసిన రిపోర్ట్‌ను రాష్ట్ర వైద్య శాఖకు అందజేస్తామని విచారణ అధికారి తెలిపారు.
అసలు ఏం జరిగిందంటే:నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన ఓ వీడియో ఇటీవల బయటకు వచ్చింది. ఆ వీడియోలో రోగిని ఇద్దరు వ్యక్తులు లాక్కెళ్తున్నట్లు ఉంది. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. వీడియో చూసిన నెటిజన్లు ఆస్పత్రి సిబ్బందిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ వెంటనే స్పందించి విచారణకు ఆదేశాలు జారీ చేసింది.