ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సౌకర్యాలు పెంచాలని, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, టీడీపీ, టీజేఎస్ పార్టీల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలను పెంచాలని కలెక్టరేట్ ఏవోకి వినతి పత్రం అందజేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 500 పడకలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ 200 లోపు మాత్రమే బెడ్లను ఏర్పాటు చేశారని వామపక్షాల నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ దవాఖానాల్లో సదుపాయాలు లేక కొవిడ్ బారినపడిన రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోందన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచాలని ధర్నా - కరోనా వైరస్ వార్తలు
నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట పలు పార్టీల నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సౌకర్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆస్పత్రుల్లో వసతులు ఉన్నప్పటికీ కావలసినంత సిబ్బంది లేరని... ఫలితంగా ఉన్న వారిపైనే పని భారం పెరగడం వల్ల మెరుగైన వైద్యం అందించలేకపోతున్నారని పేర్కొన్నారు. ఇటువంటి హెల్త్ ఎమర్జెన్సీ కాలంలో వైద్య సిబ్బందిని పెంచడానికి ప్రభుత్వం తగినన్ని నిధులను కేటాయించి దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా సాకును చూపి లక్షల రూపాయలను ఫీజుల రూపంలో ప్రజల నుంచి దండుకుంటున్నారన్నారు. వారిపైన ఎటువంటి అజమాయిషీ లేకపోవడం వల్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి భూమయ్య, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గంగన్న, టీడీపీ జిల్లా నాయకులు వినోద్ కుమార్, టీజేఎస్ నాయకులు ఎస్కే సలీం, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:డీజీపీ కార్యాలయం ముందు కానిస్టేబుల్ అభ్యర్థుల ధర్నా