నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో గంగపుత్ర చైతన్య సమితి ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీపై సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్ట్ 5న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో సొసైటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు.
చేప పిల్లల సైజు తక్కువైతే వెనక్కివ్వాలి..
చేప పిల్లలు పోసే రోజున ప్రతీ గంగపుత్ర సంఘం, మత్స్య పారిశ్రామిక సహకార సొసైటీ సభ్యులు తమ పరిధిలో ఉన్న చెరువుకు తరలిరావాలని నిజామాబాద్ జిల్లా చైతన్య సమితి ముఖ్య సలహాదారుడు పల్లికొండ నర్సయ్య గంగపుత్ర సూచించారు. చేప పిల్లలు పంపిణీ చేసేటప్పుడు జిల్లాలోని సొసైటీలు లెక్కలు కచ్చితంగా చూసుకోవాలని కోరారు. చేప పిల్లల సైజు ఏమాత్రం తక్కువగా ఉన్నా వెంటనే వెనక్కి ఇచ్చేయాలని తీర్మానించినట్లు నర్సయ్య స్పష్టం చేశారు.
అమరులకు శ్రద్ధాంజలి...
ఇటీవలే పోచంపాడ్ ప్రాజెక్టు, జిల్లా చెరువుల్లో ప్రమాదవశాత్తు చనిపోయిన గంగపుత్ర అమరులకు శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించారు. గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ బెస్త తండ్రి మరణం పట్ల నేతలు నివాళులు అర్పించారు.
త్వరలోనే ధర్నాలు...
జిల్లాలోని నందిపేట్ మండలం ఉమ్మేడ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ దాష్టీకం మూలానా గంగపుత్ర కుటుంబీకులపై సాంఘీక బహిష్కరణ ఇంకా కొనసాగుతూనే ఉండటాన్ని సమావేశంలో ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్రీ గ్రామంలో గంగపుత్ర కుటుంబాలను సాంఘికంగా బహిష్కరించిన ఘటనపై త్వరలోనే పెద్ద ఎత్తున నిరవధిక ధర్నాలు నిర్వహించనున్నట్లు సమితి జిల్లా నేత ఉట్నూర్ బాలయ్య గంగపుత్ర స్పష్టం చేశారు. సమావేశంలో నిజామాబాద్ గంగపుత్ర చైతన్య సమితి నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు భూమేష్, రాము, భోజేందర్ సహా నందిపేట్ మండలం గంగపుత్రులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : ఐదు నెలలుగా అందని వేతనాలు