దశాబ్దకాలంగా నిజామాబాద్ జిల్లా వాసులను ఊరిస్తున్న విమానాశ్రయం ఏర్పాటుపై మరోసారి సర్వే మొదలైంది. ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ ఏజెన్సీకి సర్వే బాధ్యతలు అప్పగించగా.... 15 రోజుల నుంచి జక్రాన్పల్లిలో పనులు సాగుతున్నాయి. 2013లో ఒకసారి... అంతకంటే ముందు మరోసారి ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా బృందం ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి సర్వే చేసింది. 2018లోనూ ప్రతిపాదిత స్థలంలో ఎంత భూమి వినియోగించుకునే విషయాన్ని పరిశీలించారు. ఉడాన్ కింద కేంద్రం విమానాశ్రయ ఏర్పాటు నిర్ణయం తీసుకోగా.. గత ఆగస్టులోనే ఏఏఐ అధికారులు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించగా.. సరిగ్గా ఏడాదికి ఇప్పుడు మరో సర్వే జరుగుతోంది.
భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధం...
తొలుత జక్రాన్పల్లిలో విమానాశ్రయం ఏర్పాటుకు 2వేల ఎకరాలు కావాల్సి ఉంటుందని భావించారు. ఆ తర్వాత ఉడాన్ కింద దేశీయ విమానాశ్రయం మాత్రమే నిర్మించేందుకు మొగ్గుచూపగా 1600 ఎకరాలు చాలని భావించారు. అందులో జక్రాన్పల్లి, కోలిప్యాక్, తొర్లికొండ, మనోహరాబాద్, అర్గుల్ గ్రామాల శివారులో ప్రతిపాదితస్థలం ఉంది. ఈ 1600 ఎకరాల్లో 1300 ఎకరాలు అసైన్ట్ భూములుండగా... 300 ఎకరాలు పట్టాభూములున్నాయి. ఒకవేళ విమానాశ్రయం వస్తుందంటే... పరిహారం చెల్లిస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధమని రైతులు చెబుతున్నారు.