ఆ ఇల్లు ఆకుపచ్చని అందాల హరివిల్లు. హరితహారానికి నిలువుటద్దం. రకరకాల మొక్కలు, రంగురంగుల పూలు, నోరూరించే పండ్లతో కూడిన సుందర నందనవనం. అన్నింటికీ మించి అద్భుతమైన సువాసన.. ఆహ్లాదకరమైన వాతావరణం. తల్లిదండ్రుల స్ఫూర్తితో ఇంటినే హరితవనంగా మార్చుకున్నారు... నిజామాబాద్‌కు చెందిన వెంకటేశ్. తక్కువ స్థలంలోనే వివిధ రకాల మొక్కలు నాటి ఇంటిని ప్రకృతిమయం చేశాడు. హరితహారంలో భాగంగా ఇచ్చిన మొక్కలు సైతం ఏపుగా పెరిగి చల్లని నీడనిస్తున్నాయి.
నిజామాబాద్ జిల్లా వినాయక్‌నగర్‌కు చెందిన వెంకటేష్‌కు మొక్కల పెంపకం, వాటి సంరక్షణ అంటే అమితమైన ప్రేమ. వెంకటేష్ తల్లిదండ్రులకు మొక్కలంటే ప్రాణం. మొక్కలనూ పిల్లలతో సమానంగా చూడటం అద్భుతంగా అనిపించేది. అదే అలవాటు... తన ఇంటిని హరితవనంగా మార్చేలా చేసింది. 100 గజాల స్థలంలో 60 గజాల్లోనే ఇల్లు ఉండటంతో ఖాళీ ప్రదేశం వెలితిగా అనిపించింది.
అక్కడ రకరకాల పూలు, కూరగాయలు, పండ్ల మొక్కలు నాటారు. ప్రస్తుతం ఉన్న చెట్లలో 15ఏళ్ల వయసున్న వృక్షాల నుంచి 15రోజుల క్రితం నాటిన మొక్కల వరకూ ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడంతో... అవి ఏపుగా పెరిగి మొత్తం ఇంటిని పచ్చని పందిరితో కప్పేశాయి. లోపలికి వెళ్తే తప్ప ఇక్కడ ఇల్లు ఉందన్న సంగతి ఎవరికీ తెలియదు.
వెంకటేష్, మల్లీశ్వరీ దంపతుల ఇంట్లో పూలు, పండ్లు, ఇతర నీడనిచ్చే చెట్లు, కూరగాయలు పెంచుతున్నారు. 3 రకాల మామిడి, సీతాఫలం, బొప్పాయి, నిమ్మ, జామ వంటి పండ్ల చెట్లు ఉన్నాయి. వెదురు చెట్టునూ పెంచుతున్నారు. 3 రంగుల్లో పూలు లభించే మందారం, తెలుపు, నీలం రంగుల్లో శంఖుపూల చెట్లు ఇక్కడ కనిపిస్తాయి. 3 రకాల మల్లె మొక్కలున్నాయి. కలకత్తా పాన్‌లో వినియోగించే తమలపాకు చెట్టు కూడా ఉంది.