Dog Attacks Increases in Nizamabad District: నగరం, పట్టణం, పల్లె ఎక్కడ చూసినా గ్రామసింహాలు గుంపులు గుంపులుగా ఉంటూ వీధుల్లో స్వైర విహారం చేస్తున్నాయి. బడికి వెళ్లే పిల్లల వెంట పడుతున్నాయి. పనులు ముగించుకొని రాత్రి వేళల్లో ఇళ్లకు చేరేవారు ప్రాణాలు అర చేతిలో పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఉదయం, సాయంత్రం నడక సాగించే వారూ ఇబ్బంది పడుతున్నారు. వాహనదారులకూ కష్టాలు తప్పడం లేదు.
Dog Attacks Increases in Telangana: నిజామాబాద్ జిల్లాలో వరుస ఘటనలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. హైదరాబాద్‌లోని అంబర్పేట్లో నిజామాబాద్ జిల్లా ఇందల్వాయికి చెందిన నాలుగేళ్ల బాలుడు కుక్కల దాడిలో మృతి చెందాడు. మూకుమ్మడిగా దాడి చేయడంతో నిస్సహాయ స్థితిలో చూస్తుండగానే పసివాడు ప్రాణాలు వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇంకెంతమంది తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి వస్తుందోనన్న ఆందోళన అందరూ వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో గడచిన 13 నెలల్లో ఏకంగా 4 వేల 340 మంది కుక్కకాటుకు గురైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపు ఉండే అవకాశం ఉంది. శునకాలను నియంత్రించాల్సిన యంత్రాంగం చోద్యం చూస్తుండటంతో అమాయకులు ప్రాణాలు వదిలేయాల్సిన దుస్థితి దాపురించింది. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి కుక్కల దాడిలో గాయపడ్డ వారు నిత్యం 20 నుంచి 25 మంది వైద్యం కోసం వస్తున్నారంటేనే ఏ స్థాయిలో కుక్కల బెడద ఉందో అర్థం చేసుకోవచ్చు.