నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కుకునూరు శివారులో విషాదం చోటుచేసుకుంది. రైలు ఢీకొని 55 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. అంక్సాపూర్ గ్రామానికి చెందిన గొల్ల చిన్న బోజెందర్ అనే గొర్ల కాపరి తన గొర్రెలను అంక్సాపూర్ నుంచి కుకునూరు వెళ్లే మార్గానికి మేత కోసం తీసుకెళ్లారు. మూగజీవాలు మేత మేస్తూ.. అక్కడే ఉన్న ర్వైల్వే ట్రాక్ మీదికి చేరుకున్నాయి. పడుకోటానికి అనువుగా ఉందనుకున్నాయో ఏమో మరి.. ఆ జీవాలన్ని ట్రాక్ మీదే కాసేపు సేద తీరాయి.
గొర్రెలన్నీ పిట్టల్లా...
గొర్రెలు విశ్రాంతి తీసుకుంటున్నాయి కదా అని.. కాపరి కూడా కాసేపు నీడపట్టున కూర్చుండిపోయాడు. ఇంతలోనే మెరుపు వేగంతో రైలు దూసుకొచ్చింది. కాస్త ఏమరుపాటుగా ఉన్న కాపరి ఈ విషయాన్ని గమనించలేకపోయాడు. చూస్తూండగానే.. ట్రాక్ మీదున్న గొర్రెలన్నీ.. రైలు వేగానికి పిట్టల్లా ఎగిరి చెల్లాచెదురుగా పడ్డాయి. కాపరి అప్రమత్తం అయ్యేలోపే.. జరగాల్సిన పూర్తి నష్టం జరిగిపోయింది. ఏం జరుగుతుందో తెలుసేలోపే ఆ అమాయక మూగజీవాల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.