10th Class Girl Suicide in Nizamabad : నేటికాలంలోకొంతమంది యువత ప్రేమ పేరుతో.. తమ బంగారంలాంటి భవిష్యత్తును ఆగం చేసుకుంటున్నారు. తెలిసీ తెలియని వయసులో ఆకర్షణను.. ప్రేమ అనుకుని మోసపోతున్నారు. పట్టుమని 18 ఏళ్లూ రాకముందే.. 10వ తరగతి కూడా పూర్తి కాని విద్యార్థులు.. తమ సోల్‌మేట్ దొరికేసిందంటూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. ఈ క్రమంలో జరగాల్సిన నష్టం జరిగాక గానీ.. వారు ఆ మత్తులో నుంచి బయటకు రాలేకపోతున్నారు.
తమది ప్రేమ కాదు.. కేవలం ఆకర్షణే అన్న వాస్తవాన్ని ఆలస్యంగా గ్రహిస్తున్నారు. ఈ ఆలస్యం కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెస్తోంది. నమ్మిన వాడు శారీరకంగా వాడుకుని నట్టేట ముంచేశాక.. అటు ఇంట్లో చెప్పలేక, ప్రేమించిన వాడిని ఏమీ అనలేక ఎంతోమంది ఉసురు తీసుకుంటున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువ మంది మైనర్లే ఉంటుండటం గమనార్హం. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ఓ ఘటనే వెలుగులోకి వచ్చింది.ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేశాడని మనస్తాపం చెందిన ఓ పదో తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నిజామాబాద్ జిల్లా అర్సపల్లికి చెందిన.. మేకల నాగరాజు-సునీత దంపతులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి శ్రీకాంత్, శ్రీలత (16) సంతానం. కుమార్తె శ్రీలత ప్రస్తుతం 10వ తరగతి చదువుతోంది. ఇటీవల ఆమెకు కళ్ల కలక రావడంతో శనివారం రోజున పాఠశాలకు వెళ్లకుండా.. తల్లితో కలిసి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో కూరగాయలు తీసుకురావడానికి తల్లి సునీత నిజామాబాద్‌కు వెళ్లగా.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చున్నీతో దూలానికి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.