Vasanta Panchami at Basara: నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో కన్నుల పండవగా వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. వేకువజామున 3 గంటలనుంచే అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున రెండు గంటలకు అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మూడు గంటల నుంచి అక్షర శ్రీకార పూజలను అర్చకులు ప్రారంభించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Vasant Panchami in Basara : ఉదయం 7 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విటల్ రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్త్రాలు సమర్పించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బాసరలో మంత్రి జాతీయ పతాకం ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా భక్తులకు తిప్పలు తప్పలేదు. క్యూలైన్లలో భక్తులు తమ పిల్లలను తీసుకొని గంటల తరబడి నిలుచున్నారు.
వసంత పంచమి వేడుక కావడంతో ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తుతున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి ఇక్కడికి తీసుకువచ్చారని తెలిపారు. ఇప్పటివరకు 2000 మంది పిల్లలకు అక్షరాభ్యాసం పూర్తి అయ్యిందని వెల్లడించారు. సరస్వతీమాత కటాక్షం ఉంటే తమ పిల్లల భవిష్యత్ దేదీప్యమానంగా వెలుగుతుందని.. బంగారు భవిష్యత్ అవుతుంది తల్లిదండ్రుల నమ్మకమని మంత్రి చెప్పారు.