బాసర ట్రిపుల్ ఐటీగా పిలుచుకునే.. రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం ప్రవేశాలపై ఈ ఏడాది సర్వత్రా ఆసక్తి నెలకొంది. గ్రామీణ, పేద విద్యార్థులకు నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన బాసర ట్రిపుల్ ఐటీ.. ఆరేళ్ళ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులను అందిస్తోంది. పదో తరగతి జీపీఏ స్కోరు ఆధారంగా బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలుంటాయి. సాధారణంగా 10 జీపీఏ ఉన్న విద్యార్థులకే ఇక్కడ సీటు దక్కుతుంది. అయితే గ్రామీణ, పేద విద్యార్థులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో జిల్లా పరిషత్, ప్రభుత్వ బడుల్లో చదివిన విద్యార్థులకు 0.4 గ్రేడు అదనంగా కలుపుతారు.
ఏడాది | 10 జీపీఏ వచ్చిన విద్యార్థుల సంఖ్య |
2017 | 2,427 |
2018 | 4,768 |
2019 | 8,676 |
వివిధ కోణాల్లో పరిగణన
కానీ ఈ ఏడాది ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఖరారు చేస్తున్నందున.. సుమారు 50 వేల మందికి పైగా 10 జీపీఏ వస్తుందని అంచనా. యూనివర్సిటీలోని సుమారు 1500 సీట్ల కోసం వీరందరూ పోటీపడే అవకాశం ఉంది. ఒకవేళ చాలా మందికి 10 జీపీఏ ఉంటే గణితం, సైన్స్, ఇంగ్లీష్, సోషల్, ఫస్ట్ లాంగ్వేజ్ లో గ్రేడ్లను పరిగణనలోకి తీసుకుంటారు. అయినప్పటికీ అన్నీ సమానంగా ఉంటే వయసులో పెద్దవారికి ప్రాధాన్యం ఉంటుంది. అన్ని కోణాల్లో చూసినప్పటికీ ఈ ఏడాది ఒక్కో సీటుకు పోటీ పడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ప్రవేశ పరీక్ష నిర్వహించాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్ష నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి లాటరీ వంటి విధానాలు అమలు చేయడం ఉత్తమమని మరికొందరు సూచిస్తున్నారు.