తెలంగాణ

telangana

ETV Bharat / state

Basara IIIT: బాసర ట్రిపుల్‌ ఐటీలో ప్రారంభం కాని డిగ్రీ ప్రవేశాలు.. ఆందోళనలో విద్యార్థులు - తెలంగాణ వార్తలు

బాసర ట్రిపుల్‌ ఐటీలో డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం కాకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రెగ్యులర్‌ వైస్‌ఛాన్స్‌లర్‌ లేకపోవడంతో విశ్వవిద్యాలయం ఆలనా, పాలన పట్టుతప్పుతోంది. బీటెక్‌ లాంటి కోర్సుల్లో ఇప్పటికే రెండో విడత కౌన్సిలింగ్‌ పూర్తికాగా... బాసర ట్రిపుల్‌ ఐటీలో మాత్రం ఇంకా ఫలితాల జాబితాను విడుదల చేయడంలేదు. దీంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Basara IIIT
Basara IIIT

By

Published : Nov 19, 2021, 10:32 PM IST

చదువుల తల్లి కొలువైన నిర్మల్‌ జిల్లా బాసరలో ఏర్పాటుచేసిన ట్రిపుల్‌ ఐటీ నిర్వహణ అంతా... ట్రబుల్‌ ఐటీగా మారుతోంది. నిబంధనల ప్రకారమైతే విద్యాసంవత్సరం ఆరంభంలోనే వార్షిక పరీక్షలు నిర్వహించి... ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా గత సంవత్సరం పీయూసీ- 2 చదువుతున్న విద్యార్థులను 6 జీపీ సాధారణ మార్కులతో పాస్‌ చేయాలని విశ్వవిద్యాలయం నిర్ణయించింది. కానీ గతంలో పొందిన మార్కుల ఆధారంగా దాదాపుగా 300 మంది విద్యార్థులకు... 6జీపీ కంటే తక్కువగా మార్కులు రావడరంతో ఆగస్టులో ఇంప్రూమెంట్‌ పరీక్షలు నిర్వహించింది. ఇందులో 6జీపీకంటే తక్కువ వచ్చిన వారితోపాటు ఆపై జీపీ వచ్చిన 1500 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరందరి ప్రశ్నాపత్రాలను ట్రిపుల్‌ ఐటీలోని కంట్రోలర్‌ ఆఫ్‌ పరీక్షల నిర్వహకులే దిద్ది ఫలితాలు వెల్లడించాల్సి ఉన్నప్పటికీ ఇంకా ఆ ప్రక్రియ పూర్తికాలేదు. దాంతో ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూడాల్సి వస్తోంది. ఇతర విశ్వవిద్యాలయాల్లోని పలు కోర్సులకు ప్రవేశాలు ప్రారంభమైనప్పటికీ బాసర ట్రిపుల్‌ ఐటీలో మాత్రం ఇంకా ఫలితాల జాబితాను విడుదల చేయడంలేదు. దీంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆచరణలో లేని ఆశయం..

వాస్తవంగానైతే ఇంటర్మీడియట్‌తో సమానమైన ట్రిపుల్‌ పీయూసీ పాసైన అభ్యర్థులంతా ఎంసెట్‌ రాయడానికి అర్హులే. కానీ కరోనా కారణంగా ట్రిపుల్‌ ఐటీలో విద్యాబోధన సరిగా జరగలేదు. చాలా మంది విద్యార్థులు ఎంసెట్‌ సైతం రాయలేదు. ఎంసెట్‌ రాసిన కొంతమంది విద్యార్థులకు ఇతర ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేరేందుకు అవకాశం వచ్చింది. బాసర ట్రిపుల్‌ ఐటీలో ఎంచుకున్న సబ్జెక్టులో సీటు లభిస్తే... మిగిలిన కళాశాలలకు వెళ్లడానికి ఇష్టపడటంలేదు. బాసరలో ఎంచుకున్న సబ్జెక్టులో సీటు రానట్లయితే మిగిలిన కళాశాలలను ఎంపిక చేసుకోవచ్చు. కానీ ఫలితాలు వెల్లడించకపోవడంతో... మిగిలిన కళాశాలల్లో చేరే అవకాశం కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బాసర ట్రిపుల్‌ ఐటీలోని పలు ప్రవేశాల్లో ప్రైవేటు విద్యార్థులకే ప్రాధాన్యత లభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి ఉన్నత విద్యను అందించాలనే ఆశయం ఆచరణలోకి రావడం లేదు.

సుదీర్ఘకాలంగా ఇన్‌ఛార్జీ వీసీలే...

సుదీర్ఘకాలంగా బాసర ట్రిపుల్‌ ఐటీ ఇన్‌ఛార్జీ వైస్‌ఛాన్సలర్లతో కొనసాగుతుండటంతో విశ్వవిద్యాలయం ఆలనా, పాలనపై సరైన ఆజమాయిషీ లేకుండా పోతోంది. ప్రభుత్వం సైతం పెద్దగా పట్టించుకోవడంలేదనే ఆరోపణలను మూటగట్టుకుంటోంది. ఇప్పటికై పీయూసీ -2 ఫలితాలను విడుదల చేస్తే... విద్యార్థులకు మేలుచేసినట్లవుతుంది.

ఇదీ చదవండి:RGUKT Basar: బాసర ట్రిపుల్‌ ఐటీలో గ్రామీణ విద్యార్థులకు నిరాశ.. కారణాలివే..!

ABOUT THE AUTHOR

...view details