Student Suicide in Basara RGUKT : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పీయూసీ-1 చదువుతున్న జాదవ్ బబ్లూ (17) బాయ్స్ హాస్టల్ 1లోని తన గదిలో ఉరేసుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం గమనించిన తోటి విద్యార్థులు వైద్యశాలకు తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
IIIT Student Suicide Nirmal District : విద్యార్థి సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ పట్టణానికి చెందిన విద్యార్థిగా గుర్తించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నిర్మల్ జిల్లా అసుపత్రి ముందు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. మీడియాను, విద్యార్థి సంఘ నాయకులను ఆసుపత్రి లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకులు పోలీసులను తోసుకొని ఆసుపత్రిలోకి వెళ్లారు. దీంతో వాతావరణం కాస్త రణరంగంగా మారింది. కాంగ్రెస్ నాయకులు నేరుగా పోస్టుమార్టం గది దగ్గరకి వెళ్లి.. అక్కడ కూర్చొని విద్యార్థి మృతి గల కారణాలు ఏమిటని అని ఆరా తీశారు. బాసర ఆర్జేయుకేటి(BasaraRGUKT)లో ఇప్పటి వరకు దాదాపు పదుల సంఖ్యలో విద్యార్థులు చనిపోతే ప్రభుత్వం ఆత్మహత్య(Student Suicides)లను నివారించలేక పోతుందన్నారు. కనీసం ఇలా ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి ఆవరణంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. దీంతో నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ సంవత్సరంలోనే ఆర్‌జీయూకేటీలో నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని అధికారులు వెల్లడించారు.