Adelli Pochamma Temple: ఆ ఆలయంలోని అమ్మవారికి కోనేటి నీటితో వండిన అన్నంలో పెరుగు కలిపి నైవేద్యంగా సమర్పించి... ఏదయినా కోరుకుంటే కచ్చితంగా నెరవేరుతుందనేది భక్తుల నమ్మకం. ఏకశిలపై త్రిశూలం, ఢమరుకంతో దర్శనమిస్తూ... కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచింది. ఆ దేవతే నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లిలో కొలువైన మహపోచమ్మ తల్లి దేవాలయం. ఈ ఆలయంలో అమ్మవారు తనతో పాటు ఆరుగురు అక్కాచెల్లెళ్లతో కలిసి పూజలందుకుంటోంది. సహ్యద్రి పర్వత శ్రేణుల పచ్చదనాన్ని పాన్పులుగా చేసుకున్నట్లుండే ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులను కనువిందు చేస్తాయి. అమ్మవారు స్వయంభువుగా కొలువైన ఈ మహిమాన్వితమైన క్షేత్రం వెనుకచిన్న కథ ప్రాచుర్యంలో ఉంది.
అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులు చారిత్రక నేపథ్యం
స్థలపురాణం ప్రకారం పూర్వం నిర్మల్ జిల్లాలోని అడెల్లి ప్రాంతంలో తీవ్ర కరవు సంభవించి తినడానికి తిండిలేని పరిస్థితి నెలకొంది. అనారోగ్యాలతో ప్రజలు చనిపోవడం... ఊర్లకు ఊర్లు శ్మశానాలుగా మారిపోయాయి. దిక్కుతోచని స్థితిలో జనాలు తమను కాపాడమని పరమశివుడిని ప్రార్థించారు. భక్తుల మొర ఆలకించిన ఆయన ఈ ప్రాంతానికి రక్షకురాలిగా తన కుమార్తె అయిన పోచమ్మను పంపించాడు. తండ్రి ఆదేశాలతో భువికి చేరుకొని ప్రజలకు అండగా నిలిచింది. సమృద్ధిగా వానలు కురిపించి కరవును రూపుమాపింది. అప్పటి నుంచి అమ్మ వారు కోరిన కోర్కెలు తీరుస్తూ ఈ అడవిలోనే ఉండిపోయిందని భక్తుల విశ్వాసం.
ఆలయ ప్రాంగణంలో సహ పంక్తి భోజనాలు పెరుగన్నమే ప్రీతి
నిర్మల్ జిల్లాలోని అడెల్లి పోచమ్మ తల్లికి పెరుగన్నమంటే చాలా ప్రీతి. అందుకే కోనేటి నీటితో అన్నం వండి పెరుగుతో కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వంటలు చేసుకొని సహ పంక్తి భోజనాలు చేయడం ఆనవాయితీ. అమ్మవారిని పూర్వం నుంచి పసుపుతోనే పూజిస్తారు. అందుకే ప్రతి ఆదివారం గర్భగుడిలో పసుపు రాశులు దర్శనమిస్తాయి. అలాగే అమ్మవారి అనుగ్రహంతో ఆలయం ముందు రూపాయి బిల్లలను నిల్చునేలా పెడితే కిందపడకుండా ఉంటాయి.
సహ పంక్తి భోజనాలు
"ఈ దేవాలయం ఎంతో ప్రాశస్థ్యం కలది. తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల నుంచి భక్తులు విశేషంగా హాజరై బంధువులతో వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటారు. 2014 నుంచి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం. రూ. 65 లక్షలతో ఆలయ ప్రహరీ, కోనేరు, సీసీ రోడ్లను నిర్మించాం. ప్రస్తుతం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచన మేరకే రూ.6.50 కోట్లతో ఆలయ పునర్నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమైంది. ఆలయానికి ఉన్న 15 ఎకరాల స్థలం రానున్న రోజుల్లో చాలదనే ఉద్దేశంతో మరో 20 ఎకరాల భూమిని కొనుగోలు చేయాలనే ప్రతిపాదనలు చేస్తున్నాం." -మహేశ్, ఆలయ ఈఓ, అడెల్లి నిర్మల్
అన్ని సౌకర్యాలు
"అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే.. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా అడెల్లి పోచమ్మ తల్లి పూజాలందుకుంటోంది. ఒకప్పుడు సరైన రోడ్డు, నీటి సౌకర్యాలు లేవు. నేడు ఈ ఆలయం దశదిశ మార్చిన ఘనత మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికే దక్కుతుంది. రోజురోజుకీ పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా సదుపాయాలు కల్పిస్తున్నాం. నూతనంగా బోథ్ నుంచి అడెల్లి వరకు రోడ్డు మార్గం వేయించాం. ఒక్కసారి వచ్చిన వారు పది మందికి చెప్పుతుండటంతో అమ్మవారి శక్తి స్వరూపాలు తెలిసి భక్తులు విపరీతంగా తరలివస్తున్నారు." -అయిటి చందు, ఆలయ ఛైర్మన్, అడెల్లి నిర్మల్
ఆభరణాలకు అభిషేకం
"కొన్ని సంవత్సరాల క్రితం కరవు ఏర్పడితే ప్రజలు శివుడిని ప్రార్థించారు. అప్పుడు తన కుమార్తె పోచమ్మను ఇక్కడికి పంపడంతో వర్షాలు కురిపించి కరవు రూపుమాపిందని పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి అమ్మవారు భక్తుల కోర్కెలు తీరుస్తూ అడెల్లిలోనే ఉండిపోయింది. నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి ఆభరణాలకు గోదావరిలో అభిషేకం జరుపుతాం. ఈ వేడుకకు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ప్రతి ఆదివారం ఇక్కడ జాతర జరుగుతుంది. అడెల్లి పోచమ్మ భక్తుల కొంగుబంగారంగా నిలుస్తుంది." -శ్రీనివాస్ శర్మ, ఆలయ పూజారి, అడెల్లి నిర్మల్
మా ఇలవేల్పు
''మా ఇంటి ఎలవేల్పు అడెల్లి పోచమ్మ.. మేము ఏ పని చేసినా ముందుగా అమ్మవారిని పూజిస్తాము. భక్తుల కోరికలు తీర్చే అమ్మవారి వద్దకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు. ప్రస్తుతం సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి. భవిష్యత్తులోనూ మహా పుణ్యక్షేత్రంగా ఈ ప్రాంతం ఎదగాలి." -మల్లేష్, వెల్మల్
శక్తిస్వరూపిణికి గంగనీళ్ల జాతర
శివపార్వతుల ఏడుగురు కుమార్తెలైన బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి విగ్రహాలు ఈ ఆలయ గర్భగుడిలో ఉన్నాయి. ఇలా దేశంలో మరెక్కడా ఉండవని పండితులు చెబుతున్నారు. పరశురాముడు ఈ ప్రాంతంలో పర్యటించి తల్లి గద్దెను ఏర్పాటు చేశాడని పురాణాలు తెలుపుతున్నాయి. దేవీ శరన్నవరాత్రులకు ముందు గంగనీళ్ల జాతర చేస్తారు. దసరాకు ముందు వచ్చే (అమావాస్య) తర్వాత శని, ఆదివారాల్లో ఇది నిర్వహిస్తారు. అమ్మవారి ఆభరణాలకు గోదావరిలో జాలాభిషేకం చేయడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఆదివారం ఉదయం దేవత ఆభరణాలకు సాంగ్విలోని గోదావరి జలాలతో అభిషేకం నిర్వహిస్తారు. భాజాభజంత్రీలు, పోతురాజుల నృత్యాలతో తిరిగి ఆలయానికి తీసుకువస్తారు. అమ్మవారి ఆభరణాలను దర్శించుకోడానికి నిర్మల్, నిజామాబాద్లతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరువుతారు.
ఇదీ చదవండి:KTR In Rangareddy district : రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి దిక్సూచి : కేటీఆర్