లేడిపిల్లలా చెంగుచెంగున గెంతుతూ ఇల్లంతా సందడి చేసిన చిన్నారి రోజురోజుకు చిక్కి శల్యమవుతుంటే ఆ తల్లిదండ్రులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. వైద్యం చేయించే ఆర్థిక స్థోమత లేక దాతలు అందించే సాయం కోసం ఎదురుచూస్తున్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దూరుకు చెందిన శ్రీనివాస్, జయ దంపతులు ఉపాధి నిమిత్తం నాలుగేళ్ల క్రితం నిర్మల్ పట్టణానికి వచ్చారు. శాంతినగర్లో అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమార్తె లయకు ఏడేళ్లు, స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతోంది.
కుక్కదాడితో మొదలై...
గతేడాది డిసెంబరు 25న ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో ఓ కుక్క ఆ బాలికపై దాడిచేసింది. గాయపడిన ఆమెను కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి మరింత మెరుగవ్వాలన్న ఆశతో చెట్ల మందులు సైతం తాగించారు. దాదాపు నాలుగు వారాల పాటు ఆమె పరిస్థితి బాగానే ఉంది.. ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. చిన్నారికి జ్వరంగా ఉండటం వల్ల ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు.
కోమాలోకి చిన్నారి...
పరీక్షించిన వైద్యులు కుక్క కాటుతో వచ్చే రోగం రాలేదని స్పష్టం చేశారు. మూడు, నాలుగు రోజులైన పరిస్థితి మెరుగవకపోగా... నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ దాదాపు వారం రోజుల పాటు ఉంచగా... బాలిక కోమాలోకి వెళ్లిపోయింది. వేల విలువైన ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని అక్కడి వైద్యులు సూచించారు. పేద కుటుంబానికి చెందిన తాము అంత మొత్తంలో చెల్లించలేమని ఆవేదన వ్యక్తం చేయగా... అక్కడున్న వైద్యులు తమవంతు ప్రయత్నం చేశారు. పరిస్థితి విషమంగా మారగా... గాంధీ ఆసుపత్రికి వెళ్లి అక్కడి వైద్యుల కాళ్లావేళ్లా పడి బాలికను అందులో చేర్చారు.