చిన్నపాటి వర్షానికే (RAINS) రాష్ట్రంలోని పట్టణాలు, నగరాలు వణుకుతున్నాయి. పట్టణాల్లో మురుగుకాల్వలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు జలమయమవుతున్నాయి. ఖాళీస్థలాలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతంతమాత్రంగా ఉన్న మురుగునీటి వ్యవస్థతో పాటు అసంపూర్తి పనులు వర్షాకాలంలో ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. వాననీరు, మురుగునీరు కలసి ప్రధాన వీధులు, రోడ్లను నింపేస్తున్నాయి. పలు పట్టణాల్లో మిషన్ భగీరథ పనులకోసం రోడ్లను తవ్వేశారు. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో విలీన గ్రామాల్లో సమస్య మరింత తీవ్రంగా ఉంది.
అధ్వానంగా అంతర్గత రహదారులు
నిర్మల్ పురపాలిక పరిధిలో శివారు లోతట్టు ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. అంతర్గత రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. గుంతల మయమైన రోడ్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. భూపాలపల్లిలో శివారు కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు లేకపోవడంతో వర్షం వస్తే ఇళ్లలోకి మురుగనీరు, వర్షపునీరు ఇళ్లలోకి చేరుతోంది. నల్గొండలో అంతర్గత రహదారులు గుంతలతో ప్రమాదకరంగా మారాయి. కోస్గి న్యూటౌన్‌లో భగీరథ పైపులైను పనుల కోసం రోడ్లంతా తవ్వి వదిలేయడంతో వర్షాలతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మహబూబ్‌నగర్, అచ్చంపేటల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి.
మూడడుగులైన 30 అడుగుల వెడల్పు కాలువ
గత ఏడాది భారీ వర్షాలతో అతలాకుతలమైన వరంగల్‌లోని కొన్ని ప్రాంతాలు ఇటీవల వర్షాలకు ముంపుతో సతమతమవుతున్నాయి. ఆదివారం కురిసిన భారీ వర్షాలకు శివనగర్ నీట మునిగింది. 30 అడుగుల వెడల్పుతో ఉండే ఇక్కడి వరదనీటి కాలువ ఆక్రమణలతో పూర్తిగా కుచించుకుపోయింది. ఈ కాలువ 120 చోట్ల ఆక్రమణలకు గురికాగా కొన్ని చోట్ల మూడడుగుల వెడల్పునకే పరిమితమైంది. ఆక్రమణలను తొలగించకపోవడంతో వర్షాలు వచ్చాయంటే ముంపు తప్పడంలేదు.