నిర్మల్ జిల్లాలో భూ సంబంధిత కోర్టు కేసులను నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరించడానికి ప్రత్యేక ట్రైబ్యునల్ కోర్టును ఏర్పాటు చేశామని కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అన్నారు. శనివారం.. కలెక్టరేట్లో ప్రత్యేక ట్రైబ్యునల్ రెవెన్యూ కోర్టు కేసులు, తదితర అంశాలపై తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక ట్రైబ్యునల్ రెవెన్యూ కోర్టును ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మండలాల వారీగా తహసీల్దార్ల పరిధిలో ఉన్న పెండింగ్ కోర్టు కేసుల వివరాలను సత్వరమే కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. రెవెన్యూ ట్రైబ్యునల్ కేసులు, పెండింగ్ మ్యుటేషన్లు, కంపెనీలు, సంస్థలకు పాసుబుక్‌లు, ఆధార్ పెండింగ్ కేసులు, సాదాబైనామాల దరఖాస్తులను.. ప్రత్యేక ప్రణాళిక రూపంలో ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.