Rahul Gandhi Comments: బాసర ట్రిపుల్ఐటీ (రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్) విద్యార్థులు చేస్తోన్న ఆందోళనకు కాంగ్రెస్ అగ్రహనేత రాహుల్ గాంధీ సంఘీభావం ప్రకటించారు. విద్యార్థుల వాస్తవ డిమాండ్‌లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. సిల్లీ అని కొట్టిపారేయటం విస్మయాన్ని కలిగిస్తుందని సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీ అసహనం వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు అందించిన ఎనలేని కృషిని సీఎం మరిచిపోయారా..? అని ప్రశ్నించారు. బాసర ట్రిపుల్ఐటీ క్యాంపస్‌లో దయనీయమైన పరిస్థితులను ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ అహంకారపూరిత ప్రభుత్వం విద్యార్థుల శక్తిని తక్కువ అంచనా వేయకూడదని హితవు పలికారు. తెలంగాణ విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాహుల్ గాంధీ భరోసానిచ్చారు.
"ట్రిపుల్ ఐటీ బాసర క్యాంపస్‌లో దయనీయమైన పరిస్థితులను ప్రభుత్వం పరిష్కరించాలి. సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థుల శక్తిని తక్కువ అంచనా వేయకూడదు. ఉద్యమానికి విద్యార్థులు అందించిన కృషిని సీఎం మరిచిపోయారా? తెలంగాణ విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది." - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత