మూసివేసిన పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించాలని లేదంటే జీవన భృతి అందించాలని ప్రైవేటు అధ్యాపకులు డిమాండ్ చేశారు. కరోనా నెపంతో మూసివేసిన విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ నిర్మల్ జిల్లాలోని ప్రైవేటు పాఠశాల, కళాశాలల టీచర్లు ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. అధ్యాపకులు లోపలికి వెళ్లే ప్రయత్నంలో పోలీసులు అడ్డుకోవడంతో రాస్తారోకో చేపట్టారు.
నిరుద్యోగుల కృషి అనిర్వచనీయం..
తాము రోడ్డున పడేవిధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రైవేటు అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యాల స్వలాభం కోసం, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున విద్యాసంస్థలను ప్రారంభించి మళ్లీ ఇప్పుడు తమ బతుకులను అగమ్యగోచరంగా మార్చేశారని వాపోయారు. సినిమా హాళ్లు, మద్యం దుకాణాలు, ప్రజలు రద్దీగా ఉన్న స్థలాల్లో లేని వైరస్ కేవలం విద్యాసంస్థల్లోనే ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్ర సాధనలో నిరుద్యోగుల కృషి ఎంతో ఉందన్న విషయం సీఎం కేసీఆర్ గమనించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్యులను తొలగించాలి