Kadaknath Poultry farming: కోళ్లలో రకరకాల జాతులుంటాయి. వాటిలో కొన్నింటికి రుచి నుంచి ధర వరకు ఎన్నో ప్రత్యేకతలుంటాయి. అందులో ఒక అరుదైన జాతి రకమే ఈ" కడక్‌నాథ్ కోడి". మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో మాత్రమే పెరిగే ఈ అరుదైన జాతి కోళ్లను.. ఇప్పుడు రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాకు చెందిన అన్వర్ అనే రైతు పెంచుతున్నాడు. వ్యవసాయం అంటే వివిధ సాంప్రదాయ పంటలే కాదు... పశుపోషణ, చేపల సాగు, కోళ్ల పెంపకం కూడా అని.. దీంట్లో తక్కువ కాలంలో ఎక్కువ మొత్తంలో లాభాలు గడించవచ్చని అన్వర్ నిరూపిస్తున్నాడు. దిలావర్పూర్లో ఉన్న తన మూడెకరాల వ్యవసాయ క్షేత్రంలో కడక్‌నాథ్ కోళ్లను పెంచడంతో పాటు చేపల పెంపకంతో ఆదర్శసాగు చేస్తున్నాడు ఈ యువ రైతు.
నలుపే ప్రత్యేకం..
ధరతో పాటు పోషకాల్లోనూ ఈ కోడి ప్రత్యేకమే. ఇది నలుపు రంగులో ఉంటుంది. ఈకల నుంచి మాంసం వరకు అంతా నలుపే. ఈ కోడిలో ఏ మాత్రం కొవ్వు ఉండదు. ఆరోగ్యానికి దీని మాంసం మంచిదని వైద్యులు చెబుతున్నారు. ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. రుచి అమోఘం. ఈ కోడి గుడ్డులోని పోషకవిలువలు సాధారణ కోడి 14 గుడ్లలో ఉండే ప్రోటీన్లకు సమానంగా ఉంటాయి. అందుకే దీనికి ధర కూడా ఎక్కువే!
మార్కెట్లో మంచి డిమాండ్...
అధిక పోషక విలువలు, రోగనిరోధక శక్తి కలిగిన ఈ కడక్‌నాథ్ కోళ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దాంతో కోళ్ల పెంపకంలో అనుభవమున్న అన్వర్.. మధ్యప్రదేశ్‌లో అధికంగా ఉండే వీటి పెంపకానికి సంబంధించిన మెలకువలు తెలుసుకొని దిలావూర్పూర్ ఫామ్‌లో పెంచుతున్నాడు. మొదట అరకిలో బరువు ఉండే ఈ కడక్‌నాథ్ కోడి పిల్లలు వస్తాయి. తర్వాత వీటిని 3 నెలలు పెంచి పోషిస్తే కిలోన్నర నుంచి రెండు కిలోల వరకు పెరుగుతాయి. మార్కెట్లో వీటి మాంసం ధర కేజీ రూ.1000 వరకు పలుకుతోంది. ఈ కోళ్లు పొదగవు. సాధారణ కోళ్లకు వీటి గుడ్లు పొదుగు వేస్తే పిల్లలను చేస్తాయి.
"మధ్యప్రదేశ్ నుంచి ఈ బ్రీడ్ వస్తుంది. 3 నెలలు వీటిని జాగ్రత్తగా పెంచితే 2 కిలోల వరకు పెరుగుతాయి. ఇటీవల 3000 కోళ్లు అమ్మితే నాకు రూ.లక్షన్నర దాకా లాభం వచ్చింది. దీనిలో కొవ్వు ఉండదు. ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జల్లాల నుంచే కాదు మహారాష్ట్ర నుంచి వచ్చి వీటిని తీసుకెళ్తారు. కొందరు వచ్చి ఒక పెట్ట, పుంజు తీసుకెళ్లి పెంచుకుంటారు. ఈ కోడి మొత్తం నల్లగానే ఉంటుంది. దీని మాంసం కేజీ రూ.1000, గుడ్డు రూ.50 కి అమ్ముడుపోతుంది. ఈ మధ్యనే వీటి రక్షణకు సీమకోళ్లు పెంచుతున్నాను. అవి ఉంటే పాములు, విషపురుగులు రావు." -అన్వర్, కోళ్లు, చేపల పెంపకందారు
చేపల పెంపకంతోనూ మంచి లాభాలు...
వ్యవసాయ క్షేత్రంలో పుష్కలమైన నీరు ఉండటంతో కోళ్లతో పాటు చేపల పెంపకానికి మూడు పెద్ద గుంటలు ఏర్పాటు చేసి అన్వర్.. వాటిలో అపోలో ఫిష్ పెంచుతున్నాడు. ఆ చేప పిల్లలను ఆంధ్రా నుంచి తెప్పిస్తాడు. మూడు ఇంచులు ఉండే ఒక్కో పిల్లకు రూ.7 చెల్లిస్తాడు. వీటికి దాణాను ఛత్తీస్‌గఢ్‌లోని హైబిస్, సీపీ కంపెనీల నుంచి సరఫరా చేసుకుంటాడు. వీటిని 7 నెలలు జాగ్రత్తగా పెంచితే కేజీన్నర వరకు పెరుగుతాయి. ఏడాది పాటు మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. సహజంగా పెంచుతుండటంతో కేజీ రూ.100 నుంచి 110 వరకు అమ్ముడుపోతుందని అన్వర్ చెబుతున్నాడు. చేప పిల్లలు, నిర్వహణ, దాణాకు రూ.5 లక్షలు ఖర్చు చేస్తే 7 నెలల్లో మొత్తం రూ.10 లక్షలు ఆదాయం వస్తుందని.. పెట్టుబడి పోగా రూ.5 లక్షలు లాభం వస్తుందని తెలిపాడు. ఇతర రాష్ట్రాలకు వీటిని సరఫరా చేస్తానని ఇలా తన కడక్‌నాథ్ కోళ్లు, అపోలో ఫిష్ పెంపకాన్ని వివరించాడు.
ఇదీ చదవండి:Health Rewind 2021: దశాబ్దాలు చవిచూడని కుదుపు.. అంతే ధైర్యంగా ఎదుర్కొన్న ఒడుపు