నవ యువకుడు.. కుటుంబానికి చేతికందొచ్చాడు. పెద్దగా అనారోగ్య సమస్యలేవీ ఎరగని అతడు అనుకోనిరీతిలో మంచానికే పరిమితమయ్యాడు. రోజురోజుకూ చిక్కి శల్యమవుతున్నాడు. పేగుబంధం కళ్లముందే కృశిస్తుంటే ఆ తల్లిదండ్రులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఉన్నది ఊడ్చైనా రక్షించుకోవాలని తపనపడుతున్నా... చికిత్స కోసం స్థోమతకు మించి అవసరమవుతుండటం వల్ల నిస్సహాయంగా దేవుడిపై భారం వేశారు. మానవత్వమున్న వారెవరైనా ఆదుకోకపోతారా అని ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన దొనగిరి సాయికుమార్ దీనగాథ ఇది.
తలనొప్పిగా ఉందంటూ..
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవార్‌పేట్‌కు చెందిన వంజరి కిషన్, పుష్ప దంపతులకు ముగ్గురు కుమారులు. తండ్రి దర్జీ కాగా తల్లి బీడీ కార్మికురాలు. పెద్దకుమారుడు సాయికుమార్‌కు 27 సంవత్సరాలు. దాదాపు ఏడాది క్రితం వివాహమైంది. స్థానికంగా పొరుగుసేవల విధానంలో ఉద్యోగం చేస్తున్న ఈయన కొద్ది రోజుల క్రితం తలనొప్పిగా ఉందని ఇంట్లో చెప్పాడు. ఆ తర్వాత శ్వాసకు ఇబ్బంది ఏర్పడుతోందనే కారణంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. పలురకాల పరీక్షలు చేసి చివరకు మూత్రపిండాల సమస్య ఉందని గుర్తించారు. తీవ్రత ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో ఆసుపత్రికి చేరిన సాయికి ప్రస్తుతం రెండు మూత్రపిండాలు చెడిపోయాయని గుర్తించారు. చికిత్స పొందుతున్న సమయంలో న్యుమోనియా, కామెర్లు సైతం వ్యాపించాయని, కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న ఈయనకు ఇప్పటికే మందులు, పరీక్షలకు రూ.8 లక్షల వరకు ఖర్చయ్యాయని తండ్రి పేర్కొన్నారు.
తండ్రి ముందుకొచ్చినా..