నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామం వద్ద నిర్మిస్తున్న సాధర్మాట్ బ్యారేజి వద్ద నిర్వాసితులు ఆందోళనకు దిగారు. పరిహారం చెల్లించేవరకు నిర్మాణ పనులు సాగనివ్వమంటూ నిరసన తెలిపారు. అక్కడే వంటావార్పు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు బైఠాయించారు.
'మేమిక ఎదురు చూడలేం... పరిహారం ఇస్తేగాని పనులు సాగనివ్వం' - పొన్కల్ గ్రామస్థుల ఆందోళన వార్తలు
పరిహారమిస్తామని భూమిని తీసుకున్నారని... మూడేళ్లు గడిచినా చెల్లించకుండా సాధర్మాట్ బ్యారేజీ నిర్మిస్తున్నారని నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ గ్రామస్థులు వాపోయారు. పరిహారం చెల్లించే వరకు నిర్మాణం జరిగే చోటనే ఆందోళనలు కొనసాగిస్తామని వెల్లడించారు.
పరిహారం ఇస్తామని మూడేళ్లుగా చెపుతున్నారే తప్పా... తమకు న్యాయం చేసేవారే లేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు, నాయకులకు విన్నవించుకున్నా... లాభం లేకపోయిందని వాపోయారు. రాజకీయ పలుకుబడి ఉన్నవారు ముందుగా పరిహారం తీసుకున్నారని... చిన్న, సన్నకారు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. భూములు కోల్పోవడంతో పనులు లేక విలవిల్లాడుతున్నామన్నారు. పరిహారం వచ్చేవరకు బ్యారేజీ నిర్మాణం జరిగే చోటనే ఆందోళనలు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.
ఇదీ చూడండి:న్యాయవాద దంపతుల కేసులో మలుపులు... బయటపడుతున్న నిజాలు...!