Parenting tips : చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా ప్రతివ్యక్తి జీవితం చరవాణి చుట్టూ తిరుగుతోంది. తెలియకుండానే గంటల కొద్దీ సమయం దానితో గడిపేస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధిమార్గంలో ఉన్నవారి సంగతి పక్కన పెడితే చదువుకునే విద్యార్థులు దీనితో చేస్తున్న సాన్నిహిత్యం రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. బయటకు కనిపించని రీతిలో ప్రమాదకరమైన రుగ్మతల బారినపడుతున్నారు. కరోనా తరుణంలో ఆన్‌లైన్ తరగతుల పేరిట పిల్లల చేతికి వచ్చిన సెల్‌ఫోన్ మహమ్మారిలా వెన్నంటే ఉండిపోయింది. మంచికోసం అందించిన ఆ ఉపకరణం ఇప్పుడు అనేక చెడు అలవాట్లకు తోవ చూపిస్తోంది. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు పిల్లల వ్యవహారంపై మొక్కదశలోనే ఓ కన్నేసి ఉంచకపోతే మానయ్యాక అవస్థలు పడాల్సివస్తుంది.
Parents should focus on kids mobile usage : ఇటీవల హైదరాబాద్‌లో ఓ బాలికపై సహ విద్యార్థులే లైంగికదాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. విచారణలో.. ఘటనకు బాధ్యులైన విద్యార్థుల్లో ఒకరు తన తండ్రి చరవాణిలో అశ్లీల వీడియోలు చూడటం, వాటిని తోటి మిత్రులకు చూపించిన నేపథ్యంలోనే ఈ తప్పు జరిగినట్లు తెలిసింది.
నిర్మల్ జిల్లాలోని తూర్పు ప్రాంతంలో ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు గంజాయి సేవించినట్లు ఉపాధ్యాయులు గమనించారు. ఎప్పటినుంచో వారు ఈ దురలవాటుకు చేరువయ్యారన్న నిజం అందిరినీ విస్తుగొలిపింది. పశ్చిమ ప్రాంతంలో ఓ వసతిగృహంలో విద్యార్థులు హుక్కా ఉపయోగించి పట్టుబడిన సంఘటన పిల్లల్లోని విపరీత ధోరణికి నిదర్శనం.
ఇటీవల విద్యార్థులందరికీ ‘గాంధీ’ చిత్రాన్ని చూపించారు. కొంతమంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు చరవాణులతో థియేటర్‌లో హంగామా చేయడం, ఉపాధ్యాయులపై తిరగబడటం వంటి హద్దుమీరిన చేష్టలకు పాల్పడ్డారు. గురుభక్తి లేకుండా యాంత్రికంగా తయారైన పిల్లల మానసిక స్థితికి ఇది అద్దం పడుతోంది.
యాంత్రికతదే పైచేయి:టీవీల్లో సీరియళ్లు, సినిమాల్లో హీరోయిజం దృశ్యాలన్నీ కల్పిత పాత్రలే. వాటికి ఆకర్షితమై జీవితంలో నటిస్తే కలిగే అనర్థాలు జీవితాంతం వెంటాడుతాయి. ఈమధ్య కాలంలో యువత తమకు నచ్చిన హీరో, హీరోయిన్ల పాత్ర స్వభావాలను అనుకరిస్తూ తమ వాట్సప్ స్టేటస్‌లుగా పెట్టుకుంటున్నారు. రోజుకు సగటున నాలుగైదు గంటలు ఫోన్‌లోనే మునిగితేలడంతో పుస్తకాలను ముందరేసుకునే సమయం దొరకడం లేదు. ఫలితంగా సన్నిహితులతో, కుటుంబసభ్యులతో మనసువిప్పి మాట్లాడలేకపోతున్నారు. ఒత్తిడికి గురై మెల్లమెల్లగా యాంత్రిక జీవనానికి అలవాటుపడుతున్నారు.
క్రమ‘శిక్ష’ణ అవసరమే:గతంలో ఉపాధ్యాయులంటే గౌరవం ఉండేది. విద్యార్థుల బాగుకోరుతూ క్రమశిక్షణలో భాగంగా చిన్నపాటి శిక్షలు వేసేవారు. దీన్ని ఎవరూ తప్పుగా భావించేవారు కాదు. తల్లిదండ్రులే మావాడిని కొంచెం మందలించడంటూ స్వచ్ఛందంగా చెప్పేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అనుకోకుండా కాస్త గట్టిగా మాట్లాడితేనే పంచాయతీ పెట్టే స్థాయికి రావడంతో పిల్లల్లో మార్పు తీసుకురావడం ఓ పెద్ద గుదిబండగా మారింది. పిల్లల క్షేమం దృష్ట్యా మందలింపు ఆక్షేపణీయం కాదంటూ న్యాయస్థానం పేర్కొనడం ప్రస్తావనార్హం. మితిమీరిన చరవాణి వినయోగమే కాకుండా సిగరెట్లు, గంజాయి, మద్యం వంటి చెడు అలవాట్లకు సులభంగా లోనయ్యే పరిస్థితులున్నాయి. ఈ తరుణంలో మాటలతో మార్పు అసాధ్యమేనని అభిప్రాయం చాలామంది ఉపాధ్యాయుల్లో వ్యక్తమవుతోంది.