అన్ని ఆలయాల్లోలా కాకుండా... వినాయకచవితి ఉత్సవాలు మొదలైతేనే ఆ గుడిలో గణనాథుడు పూజలందుకుంటాడు. ఎందుకంటే ఆ రోజుల్లో మాత్రమే వినాయకుడిని ప్రతిష్ఠిస్తారు. పైగా ఈ గణేశుడి మరో ప్రత్యేకత ఏంటంటే అది చెక్కతో చేసిన విగ్రహం. ఇదంతా నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సరిహద్దుల్లో మహారాష్ట్రలోని పాలజ్ గ్రామంలో కొలువైన శ్రీ వరసిద్ధి కర్ర వినాయక దేవాలయం సంగతి. ఎక్కడైనా ఏటా వినాయకచవితి సంబురాలు ముగియగానే వినాయకుడిని నిమజ్జనం చేస్తుంటారు. కానీ ఈ ఆలయంలోని వినాయకుణ్ని మాత్రం చవితి వేడుకలు పూర్తవ్వగానే ఊరేగింపు జరిపి నీళ్లు చల్లి దాన్ని భద్రపరుస్తారు. మళ్లీ వినాయక చవితికే ప్రతిష్ఠిస్తారు. దాదాపు 70 ఏళ్ల నుంచి ఈ ఆనవాయితే ఇక్కడ కొనసాగుతూ వస్తోందట. ఏటా ఈ వినాయకుడిని దర్శించుకోవడానికి వేలాది భక్తులు బారులు తీరుతారు, కోరిన కోరికలు తీరుస్తాడని నమ్ముతారు.
నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సరిహద్దులో మహారాష్ట్రలోని పాలజ్ గ్రామం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. పాలజ్ గ్రామంలో కర్రతో చేసిన వినాయకుడు కోరిన కోరికలు తీర్చే దేవునిగా ప్రసిద్ది చెందాడు. మహారాష్ట్రలోని భోకర్ తాలుకా పాలజ్ గ్రామంలో 1948లో నిర్మల్ పట్టణానికి చెందిన కొయ్య బొమ్మల తయారీదారుడు గుండాజి వర్మ కర్రతో తయారు చేసిన గణేషుడిని తెచ్చి ప్రతిష్ఠించారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్బంగా 11 రోజుల పాటు ఈ కర్ర వినాయకునికి పూజలు చేసి చివరి రోజు ఊరేగింపు నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం నిమజ్జనం చేయకుండా ఒక గదిలో భద్రంగా ఉంచుతారు. ప్రతి సంవత్సరం దర్శించుకునేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వచ్చేవారు. ఈ గణేశుని దర్శనానికి ఏటా భైంసా నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడిపేవారు.
కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాలజ్ కర్ర వినాయకుని దర్శన అనుమతిని రద్దు చేశారు. ఎవరికీ కూడా అనుమతి లేదని.. పూజారి మాత్రమే ఉదయం, సాయంత్రం పూజలు నిర్వహిస్తున్నారు. పూజారి కూడా 11రోజుల పాటు ఆలయంలోనే ఉండి పూజలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈ సారి ఆన్లైన్లో ఒక లైవ్ స్క్రీన్ ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఒకవేళ అనుకోకుండా ఎవరైనా వస్తే వారి కోసం... ఆలయం బయట కొద్ది దూరంలో ఒక లైవ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు.
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం నుంచి పాలజ్ గణేష్‌ను దర్శించుకునేందుకు పాదయాత్రగా వచ్చా. కొన్నేళ్లుగా పాలజ్ గణేష్ దర్శనానికి వస్తున్నా. కోరిన మొక్కులు నెరవేరడంతో ఈసారి పాదయాత్రగా వచ్చా. ఆన్లైన్లో దర్శనం ఉండడం కాస్త బాధగా అనిపిస్తోంది. దర్శనం ఏర్పాటు చేస్తే బాగుండేంది. -గంగాధర్, భక్తుడు