ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కట్టడికి అధికార యంత్రాంగం విశ్వప్రయత్నమే చేస్తోంది. నిర్మల్ జిల్లాలో 19కేసులు నమోదు కావడం వల్ల అధికారులు విస్తృత చర్యలు చేపట్టారు. జిల్లాలో 19మండల స్థాయి బృందాలు, 20 పట్టణ స్థాయి, 396 గ్రామస్థాయి మరో 353 ఫ్రెండ్లీ నైబరింగ్ బృందాలు సర్వే చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 19 కరోనా పాజిటివ్ కేసులు కావడం వల్ల మరో 418 మంది రక్త నమూనాలను పరీక్షలకు పంపించగా 378 మందికి నెగిటివ్ వచ్చింది. మరో 40 మందికి ఎలా వస్తుందనే దానిపై అందరి దృష్టి ఉంది.
ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే 11పాజిటివ్ కేసులు నమోదవగా... మరో 126 మందిని సెకండరీ కాంటాక్ట్‌గా గుర్తించారు. వీరి రక్తనమూనాలకు సంబంధించిన రిపోర్టు రావాల్సి ఉంది. పాజిటివ్ కేసులు నమోదైన 11 మంది కుటుంబీకుల క్వారంటైన్ పూర్తయినందున వారిని స్వీయ గృహ నిర్బంధానికి తరలించారు.