తక్కువ ధరకు వస్తున్నాయని విడి విత్తనాలు కొని రైతులు మోసపోవద్దని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. ఖానాపూర్, కడెం మండల కేంద్రాల్లో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఎరువులు, విత్తనాల దుకాణాల్లో ఆయన తనిఖీలు చేశారు. కడెం మండల కేంద్రంలో 116 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు దొరికాయని తెలిపారు. వీటి విలువ సుమారు రూ.లక్ష 16 వేలు ఉంటుందన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న నరేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేసేందుకు వెనకాడేది లేదని హెచ్చరించారు. వ్యాపారులు స్టాకు లైసెన్సు, బిల్లు పుస్తకాలు, ఇతర రికార్డులు అన్నీ సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు. వ్యాపారులు రైతులకు విత్తనాలు విక్రయించే సమయంలో అన్ని వివరాలతో కూడిన రశీదులు తప్పకుండా ఇవ్వాలని అన్నారు.