నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలలో (ఈ-ఆఫీస్) సాఫ్ట్వేర్ ద్వారా వందశాతం పాలన అమలుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ-ఆఫీస్ పాలన అమలుపై అధికారులతో సమీక్షించారు. నిర్మల్, భైంసా ఆర్డీవో కార్యాలయాలు, అన్నీ మండలాల తహసీల్దార్, మండల ప్రజా పరిషత్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలు, జిల్లా, మండల వ్యవసాయశాఖ కార్యాలయాలతోపాటు మొత్తం 102 ప్రభుత్వ కార్యాలయాలలో దస్త్రాల నిర్వహణను ఈ-ఆఫీస్ ద్వారా పాలన అమలు చేయాలన్నారు. ఇప్పటికే నిర్వహణ కోసం ప్రతి శాఖకు ఒక నోడల్ అధికారి, సాంకేతిక సహాయకుడిని నియమించి ఆన్లైన్లో ఫైళ్ల నిర్వహణకు సంబంధించి శిక్షణ ఇచ్చినట్టు కలెక్టర్ తెలిపారు.
ఈ-ఆఫీస్‌తో వేగవంతంగా, పారదర్శకం సేవలు: కలెక్టర్ - ఈ-ఆఫీస్ విధానంపై నిర్మల్ కలెక్టర్ సమీక్ష
ఈ-ఆఫీస్ విధానంతో కాగితరహితమే కాకుండా... వేగవంతం, పారదర్శకంగా సేవలు అందించొచ్చని నిర్మల్ కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అన్నారు. ఈ-ఆఫీస్ పాలన అమలుపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు.

ఈ-ఆఫీస్ పని విధానంలో కాగితంతో పని ఉండదని, దస్త్రాల నిర్వహణ సులభతరంతోపాటు పారదర్శకత, విశ్వనీయత ఏర్పడుతుందన్నారు. ఫైళ్ల స్థితిగతులను పై అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవచ్చన్నారు. ఈ-ఆఫీస్ ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఏ ఫైలు ఏ అధికారి వద్ద ఉందో "ఫైల్ ట్రాకింగ్ సిస్టమ్" ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఇంతకు ముందు ఫైళ్లు భద్రపర్చాలంటే బీరువాలు, అల్మారాలు అవసరమయ్యేదని ఇపుడు వాటి అవసరం లేదన్నారు. ఈ-ఆఫీస్ ద్వారా కాగితరహితమే కాకుండా ఉద్యోగులు, అధికారులు ప్రజలకు పారదర్శకంగా, వేగంగా సేవలందించడం జరుగుతుందన్నారు.
TAGGED:
review on e-office system