దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం నూతన వ్యవసాయ విధానం అమలు చేస్తోందని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద మండలం నర్సాపూర్(డబ్ల్యూ)లో నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై జరిగిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు.
'రైతు శ్రేయస్సు కోసమే నూతన వ్యవసాయ విధానం' - నియంత్రిత పద్ధతిలో పంటల సాగు
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తోందని మంత్రి ఇంద్రకరణ్ స్పష్టం చేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని పేర్కొన్నారు.
రైతులందరూ నియంత్రిత విధానం వైపు మొగ్గుచూపాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అన్నదాతలు ప్రభుత్వం సూచించిన పంటలనే సాగుచేయాలని కోరారు. రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు రుణమాఫీ చేసి అన్నదాతల కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారని పేర్కొన్నారు.
రైతుబంధు పథకం దూరమవుతుందన్నది అపోహ మాత్రమేనని.. రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు వస్తుందని స్పష్టం చేశారు. సబ్సిడీ విత్తనాలను అక్రమంగా అమ్ముకునే వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తునట్లు చెప్పారు. 25వేల రూపాయలలోపు రుణం ఉన్న రైతుల రుణమాఫీ పూర్తయిందని, మిగితా మాఫీ నాలుగు కిస్తీల్లో జమ అవుతుందని తెలిపారు. పత్తి విత్తనాలు సరిపడా ఉన్నాయని చెప్పారు. కరోనా నేపథ్యంలో సోయా విత్తనాల కొరత ఉన్నపటికీ, రైతులకు అందుబాటులో ఉంచే విధంగా చూస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు.