గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతిక విద్యనందించాల్సిన బాసర ఆర్జీయూకేటీ అనేక తప్పిదాలకు నిలయంగా మారింది. ఈ విద్యాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి.. అవసరమైన వసతులు కల్పిస్తామని, మెరుగైన విద్యను అందిస్తామని, ఎలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని ఆ మధ్య.. విద్యాలయాన్ని సందర్శించిన మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా.. ఇక్కడి సిబ్బందిపై సరైన పర్యవేక్షణ లేక వారు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు.
కొద్ది రోజుల కిందట విద్యార్థుల ఆందోళన, ఓ విద్యార్థి ఆత్మహత్య, మతప్రచారం, ర్యాగింగ్, తాజాగా విద్యార్థినులకు వేధింపులు.. ఇలా వరుస సంఘటనలు జరుగుతున్నా, పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకోవట్లేదు. ర్యాగింగ్ పేరిట విద్యార్థుల మధ్య ఘర్షణలు జరిగితే.. పది రోజుల తర్వాత అయిదుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. వారిని నిరంతరం పర్యవేక్షించాల్సిన సిబ్బందిపై మాత్రం చర్యలు తీసుకోలేదు. ఆ ఇద్దరు ఉద్యోగులు తనను వేధిస్తున్నారంటూ ఇటీవల ఒక విద్యార్థిని.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో కలకలం రేగింది.
ప్రలోభాలతో బ్లాక్‌మెయిల్:గణాంక విభాగంలో తాత్కాలిక పద్ధతిలో పనిచేసిన ఆ ఇద్దరు ఉద్యోగులు ఇంతకుముందున్న అధికారుల ఆశీస్సులతో పదోన్నతులు పొందారు. కళాశాలలో వీరు చెప్పిందే వేదం. మిగతా ఉద్యోగులు వారి చెప్పుచేతల్లో ఉండాల్సిందే. ఆన్‌లైన్ వ్యవస్థ అంతా వీరి చేతిలో ఉండటంతో ఫీజులో రాయితీలు, బయటకు వెళ్లేందుకు పాసుల వంటి ప్రలోభాలతో విద్యార్థులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదే ధోరణిలో ఆ ఉద్యోగులు తనను వేధిస్తున్నారని ఓ విద్యార్థిని తాజాగా ఫిర్యాదు చేయడంతో కలకలం రేగింది.
అధికారుల పొంతన లేని జవాబులు:తమ విద్యార్థులెవరూ వేధింపులకు గురికాలేదని, మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తున్నామని ఆర్జీయూకేటీ డైరెక్టర్ సతీష్‌కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఒకరిద్దరు ఉద్యోగులు విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని తెలియడంతో.. విచారణకు ఏకసభ్య కమిటీని నియమించామని ఆయన తెలిపారు. మరో ఉన్నతాధికారి మాత్రం.. గేట్ పాసులు, ఇతర అవకతవకలకు పాల్పడిన ఇద్దరిపై వేటు వేసినట్లు మౌఖికంగా చెబుతున్నారు. ఆ ఉద్యోగులకు సంబంధించి సెల్‌ఫోన్లు, దస్త్రాలు, బీరువాలను సీజ్ చేశామని ఆయన తెలిపారు. ఈ ఇద్దరు అధికారుల ప్రకటనలు వేర్వేరుగా ఉండటం విద్యాలయంలో అయోమయానికి నిదర్శనం.
ఇవీ చదవండి: