నానాటికి పట్టణీకరణ పెరుగుతుంది. అందుకు అనుగుణంగా పురపాలక సంఘాలు అభివృద్ధి పనులు చేపట్టినప్పుడే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. అయితే ఆ మేరకు నిధులు లేకపోవడం వల్ల అభివృద్ధి సాగడం లేదు. మున్సిపాలిటీలకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్ను. వాటితో పారిశుద్ధ్య నిర్వహణ, వీధిదీపాల ఏర్పాటు, ఆయా వీధుల్లో చిన్నాచితకా నిర్మాణ పనులను చేపట్టవచ్చు.
ప్రధాన, అంతర్గత రహదారులు, మురుగుకాల్వలు నిర్మించాలంటే రూ.కోట్ల నిధులు కావాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడపాదడపా వివిధ పథకాలతో నిధులు అందజేస్తున్నాయి. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం పురపాలికల అభివృద్ధి కోసం టీయూఎఫ్‌ఐడీసీ సంస్థ ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. బ్యాంకు రుణ సహాయం కింద నిధులు అందుతాయి. ఆ మేరకు పురపాలక సంఘాలు వివిధ పనులు చేపట్టేందుకు ప్రతిపాదించగా మంజూరు ఇచ్చారు.
ఇంతవరకు బాగానే ఉన్నా వివిధ కారణాలతో పనులు చేపట్టడంలో జాప్యం ఏర్పడింది. అంతలోనే రాష్ట్ర ప్రభుత్వం నిధుల మంజూరును ఉపసంహరించుకుంది. దీంతో నిర్మల్ జిల్లాలోని మూడు పట్టణాల్లో చేపట్టాల్సిన పనులు నిలిచిపోయి అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో అక్కడి అధికారులు కొన్ని పనులు పూర్తిచేశారు. భైంసాలో చేపట్టిన ఒక్క పనీ అర్ధాంతరంగా ఆగిపోయింది. ప్రధాన రహదారిలో రూ.3 కోట్లతో కూడళ్లు, గుంతలు పడి చెడిపోయిన నరసింహనగర్ రహదారి అభివృద్ధికి నోచుకోవడం లేదు. నిర్మల్‌లో చిన్న పనులు ఎక్కువగా పూర్తిచేసినప్పటికీ రూ.25కోట్ల నిధులతో చేపట్టిన ప్రధాన పనులకు శరాఘాతం ఏర్పడింది. ఖానాపూర్‌లో మంజూరైన ఆరు పనులు టెండరు దశలోనే ఆగాయి. ఇలా 3 మున్సిపాలిటీల్లో రూ.50 కోట్ల పనులు అభివృద్ధికి దూరమయ్యాయి.
ప్రత్యామ్నాయ నిధులు అందించాలి