విపత్కర పరిస్థితుల్లో హిందూ, ముస్లిం యువకులు ఓ వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించి మతసామరస్యాన్ని చాటిచెప్పారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజులపేట్‌లో ఓ గుడిసెలో ఎల్లమ్మ, కిషన్ అనే వృద్ధ దంపతులు దాతల సాయంతో కడుపునింపుకొంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఈ క్రమంలో ఎల్లమ్మ (63) శనివారం ఉదయం మృతి చెందింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఎవరూ అంత్యక్రియల నిర్వహణకు వచ్చే పరిస్థితి కనిపించలేదు.
వెల్లివిరిసిన మత సామరస్యం - హిందూ వృద్ధురాలి అంత్యక్రియల్లో పాల్గొన్న ముస్లింలు
గుడిసెలో ఉంటూ జీవనం సాగిస్తున్న ఓ వృద్ధ జంటలో భార్య చనిపోగా భర్త విలవిల్లాడిపోయాడు. అంత్యక్రియలకు ఎవరూ తోడు రామనేసరికి మరింత బాధపడ్డాడు. అంతలోనే మేమున్నామంటూ ముస్లిం యువకులు వచ్చి ఆ హిందూ వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించారు.
విషయం తెలుసుకున్న స్థానిక సహారా యూత్ సభ్యులు మృతురాలికి అంత్యక్రియలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. వార్డు కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్లా ఆధ్వర్యంలో పలువురు హిందూ, ముస్లిం యువకులు అక్కడకు చేరుకొని హిందూ సంప్రదాయ రీతిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. శ్మశానవాటిక వరకు మృతదేహాన్ని మోసుకెళ్లి దహనసంస్కారాలు చేపట్టారు.ఇందులో సంఘ స్థాపకుడు ఇర్షాన్, పట్టణాధ్యక్షుడు అజర్‌ఖాన్, ఉపాధ్యక్షుడు ఇక్రమ్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు నాందేడపు చిన్ను, సభ్యులు వాహెద్, ఫైసల్, తిరుపతి, జునేద్, అమీర్, సలీం తదితరులు పాల్గొన్నారు. ఆపత్కాలంలో సేవకు ముందుకొచ్చిన సహారా యూత్‌ను స్థానికులు అభినందించారు.
ఇవీ చూడండి:వైద్య శాస్త్రంలో ఇదో మిరాకిల్..!
TAGGED:
వెల్లివిరిసిన మత సామరస్యం