మధ్యాహ్నం అవుతోంది. చాలా ఆకలిగా ఉంది. దగ్గర్లో ఉన్న మంచి హోటల్‌కు వెళ్లి చికెన్ బిర్యానీ (Chicken Birtyani) తినాలని అనుకున్నారు నిర్మల్ మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ. అనుకున్న వెంటనే తన సిబ్బందితో కలిసి దగ్గర్లో ఉన్న హోటల్ లక్ష్మి గ్రాండ్‌కు వెళ్లారు. తన సిబ్బందితో కలిసి హోటల్లో కూర్చుని చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. ఆకలి చంపేస్తోంది. బిర్యానీ రాగానే ఓ పట్టుపడదామని అందరూ వెయిటింగ్.
ఇంతలోనే వెయిటర్... చికెన్ బిర్యానీ తీసుకుని వచ్చాడు. అందరికి వడ్డించాడు. మాంచి ఆకలి మీదున్న వాళ్లంతా బిర్యానీ ఆరగించడం మొదలుపెట్టారు. కొంచెం తిన్న తర్వాత బిర్యానీ ఏదో తేడాగా అనిపించింది. అనుమానం వచ్చి చూసేసరికి బిర్యానీలో పురుగులు కనిపించాయి. అంతే ఇక తిన్నదంతా బయటకు వచ్చింది. బిర్యానీ తింటున్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
స్వయంగా మున్సిపల్ కమిషనర్‌కు వడ్డించిన దాంట్లోనే పురుగులు వచ్చాయి. వెంటనే హోటల్‌ను తనిఖీ చేశారు. రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు కుళ్లిపోయి దర్శనమిచ్చాయి. చికెన్, మటన్‌లో పురుగులు తారసపడ్డాయి. ఇక ఏ మాత్రం ఉపేక్షించకుండా... హోటల్‌ను మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ సీజ్ చేశారు. ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు. వారి ప్రాణాలతో చెలగాటమాడొద్దని హెచ్చరించారు.