Mp soyam bapurao on Basara IIIT: తక్షణమే ట్రిపుల్ ఐటీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు డిమాండ్ చేశారు. ల్యాబ్ అసిస్టెంట్‌తో పాఠాలు చెప్పించే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది విద్యార్థులున్న ఈ విశ్వవిద్యాలయంలో ఒకే ఒక్క ఫిజికల్ డైరెక్టర్ కొనసాగుతుండటం ఆశ్చర్యమేస్తోందన్నారు. రాష్ట్ర సర్కార్ స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే భాజపా పక్షాన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
'విశ్వవిద్యాలయంలో కనీస సౌకర్యాలు లేవు. రేకుల షెడ్లలో పాఠాలు చెబుతున్నారు. ఫ్యాన్లు, ఏసీ పని చేయడం లేదు. కుర్చీలు, డిజిటల్ బోర్డ్స్, డెస్క్లన్నీ చెడిపోయాయి. ప్రొజెక్టర్ అసలు పనిచేయడం లేదు. పురాతనమైన వాటర్ ఫిల్టర్ నిర్వహణ సరిగ్గా లేక తాగడానికి మంచి నీరు అందించలేని పరిస్థితి నెలకొంది. హాస్టల్లో శుభ్రత కరవై... దోమలు, ఈగలు, పురుగులతో విద్యార్థులు నానా అవస్థలు పడుతుంటే గుండె తరుక్కుపోతోంది. ఫీజుల ద్వారా ఏటా 40 కోట్ల రూపాయలకుపైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నా.. విశ్వవిద్యాలయంలో కనీస వసతులు కల్పించకపోవడం దారుణం.'