Monkey fair in dharmaram: నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండలం ధర్మారంలో ఏటా నిర్వహించే కోతి దేవుడి జాతర వైభవంగా జరుగుతోంది. నాలుగు దశాబ్దాల క్రితం వానరానికి గుడి కట్టిన గ్రామస్థులు... అప్పటినుంచి కోతిని దేవుడిగా కొలుస్తున్నారు. కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా నమ్ముతున్నారు. 1978లో భక్తుల విరాళాలతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ వానర దేవుడి ప్రతిష్ఠ వెనుక పెద్ద కథే ఉంది. అదేందో చూద్దాం.
అసలు ఈ గుడి ఎందుకు కట్టించారంటే...
నాలుగు దశాబ్దాల క్రితం ధర్మారం గ్రామం దట్టమైన అడవులతో నిండి ఉంది. రాత్రి వేళల్లో ఇక్కడ బుర్రకథలు, వీధినాటకాలు నిర్వహించేవారు. ఆరోజులలోనే ఒక కోతి అడవి నుంచి వచ్చి నిత్యం ఈ కథలు వింటుండేదని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే ఇలా గ్రామంలోకి రావడం మొదలుపెట్టిన వానరం కొన్ని రోజుల తర్వాత మితిమీరిన ఆగడాలతో వారికి విసుగు తెప్పించింది. దీంతో అందరూ కలిసి దానిని చంపి ఊరి పొలిమేరలో పాతిపెట్టారు. అదే రోజు రాత్రి వారికి కలలో వచ్చి నన్ను మామూలుగానే చంపారు. కానీ నాకు ఒక మందిరం కట్టండి. మీ ఊరికి ఎంతో సేవ చేస్తూ కొంగుబంగారంగా నిలుస్తానని చెప్పింది. దాంతో మూడు రోజుల తర్వాత కోతి శవాన్ని బయటకు తీసి మరల శాస్త్రోక్తంగా సమాధి కట్టించారు. ఆ తరువాత ఈ ఆలయాన్ని నిర్మించారు.
"ఈ కోతి దేవుడు 1977 నుంచి ఇక్కడ ప్రఖ్యాతి గాంచాడు. ఆ కాలంలోనే ఒక వానరం ఈ గ్రామానికి నిత్యం వచ్చి రాత్రి వేళల్లో వేసే నాటకాలు, బుర్రకథలు వింటుండేది. కొన్ని రోజులకు మితిమీరిన ఆగడాలతో విసుగు చెంది అందరూ కలిసి ఆ కోతిని చంపి ఊరి పొలిమేరలో సమాధి కట్టారు. అలా అప్పటి నుంచి ఏటా డిసెంబర్లో రెండు రోజులు ఈ జాతరను జరుపుకుంటున్నాం. ఇక్కడ నిర్వహించే అన్నదానం ఈ జాతర ప్రత్యేకత. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దేవునిగా కోతిని కొలుస్తారు. ఈ జాతరకు తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్రల నుంచి భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు." -రవికుమార్, స్థానికుడు ధర్మారం
దాదాపు 30 క్వింటాళ్ల బియ్యంతో...