Minister KTR Speech at Nirmal BRS Public Meeting : రాష్ట్రంలో బీఆర్ఎస్ అభివృద్ధి చేసిందని నమ్మితేనే ఓట్లు వేయండని.. లేకుంటే లేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) తేల్చి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో భాగంగా రూ.714 కోట్ల వ్యయంతో దిలావర్పూర్లో లక్ష్మీనరసింహ ఎత్తిపోతల పథకాన్ని(Lakshmi Narasimha Lift Irrigation Project) కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాడేగాం పంపుహౌస్ వద్ద మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అలాగే నిర్మల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని.. కాంగ్రెస్‌పై విమర్శలు కురిపించారు.
తొమ్మిదిన్నరేళ్లలో ఏం చేశామో చెప్పగలిగే స్థితిలో ఉన్నామని.. అదే కాంగ్రెస్ 65 ఏళ్ల పైబడి చరిత్రలో ఏం చేశారో చెప్పేస్థితిలో ఉందానని మంత్రి కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. 70 ఏళ్ల వయస్సులోనూ ఇంద్రకరణ్ రెడ్డి హుషారుగా పని చేస్తున్నారని కేటీఆర్ కొనియాడారు. నాలుగు జిల్లాల కోసం ఇంద్రకరణ్‌రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. నిర్మల్ జిల్లాలో 300 మందికి ఉపాధినిచ్చే పామాయిల్ ఫ్యాక్టరీని ప్రారంభించుకున్నామని తెలిపారు. మన కలెక్టరేట్ల మాదిరిగా చాలా రాష్ట్రాల్లో సెక్రటేరియట్లు కూడా ఉండవన్నారు.
KTR Fires on Congress Party :జిల్లాకొక మెడికల్ కాలేజీ వస్తుందని ఎప్పుడైనా అనుకున్నామా.. కానీ ఇప్పుడు సుమారు 23 మెడికల్ కళాశాలలు వచ్చాయని హర్షించారు. ఎంత పెద్ద జబ్బు అయినా.. జిల్లా ఆస్పత్రుల్లోనే చికిత్సలు అందుతున్నాయని చెప్పారు. ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు గురుకులాల్లో విద్య అందిస్తున్నామని స్పష్టం చేశారు. రూ.714 కోట్లతో దిలావర్పూర్లో లక్ష్మీనరసింహ ఎత్తిపోతల పథకం ప్రారంభంతో.. 50 వేల ఎకరాలకు నీరందుతుందని అన్నారు.