రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ దిశగా వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యతనిచ్చి వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలం పోన్కల్ గ్రామంలో రైతువేదిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి వాటిని అమలు చేస్తూ రైతును రాజులా చూస్తోందని మంత్రి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగు నీటి వసతి, 24 గంటల విద్యుత్, రైతు బంధు, రైతు బీమా పథకాలతో అన్నదాతలను ఆదుకుంటోందని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగానికే సీఎం కేసీఆర్ మొదటి ప్రాధాన్యం: మంత్రి ఇంద్రకరణ్
నిర్మల్ జిల్లా మామడ మండలం పోన్కల్ గ్రామంలో రైతు వేదిక భవనాన్ని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. రైతులను సంఘటితం చేసే దిశగా ఏర్పాటు చేసిన ఈ భవనాలను రైతన్నలు వినియోగించుకోవాలని మంత్రి కోరారు. రైతు సంక్షేమ పథకాలతో అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటోందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో విద్యుత్తుకు, నీళ్లకు కొదువ లేదని, ఒకే వేదికలో రైతులందరూ కలిసి ఏ ఏ పంటలు పండించుకోవాలో నిర్ణయించుకుని ఆ పంటలు వేసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ సూచించారు. గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారి సలహాలు, సూచనలతో పంటలు వేయాలని కోరారు. అనంతరం న్యూ సాంగ్వి గ్రామంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో నూతనంగా నిర్మించిన కళాశాల భవనాన్ని మంత్రి ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి సహ పంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్ పర్సన్ కె.విజయలక్ష్మి రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:సభ్యత్వ నమోదులో పొరపాట్లు చేయొద్దు: తలసాని