Harish Rao Comments: ప్రజారోగ్యాన్ని కాపాడటంలో కేసీఆర్ పాలనలోని తెలంగాణ మూడోస్థానంలో నిలిస్తే ప్రధాన మంత్రి మోదీ, ముఖ్యమంత్రి యోగి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ దేశంలోనే చిట్టచివరన 28వ స్థానంలో నిలిచిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వ అధీనంలోని నీతి ఆయోగ్, 15వ ఆర్థికసంఘంతో పాటు పార్లమెంటులో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రే వెల్లడించారన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలుత గురువారం ఉదయం బాసరలో సరస్వతీ అమ్మవారిని దర్శించుకొన్నారు. అనంతరం బాసర, ముథోల్, నిర్మల్‌లో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఆయన రాత్రి ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆవరణలో రూ.75 లక్షల వ్యయంతో చేపట్టనున్న రేడియాలజీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూ.150 కోట్లతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడారు. తెలంగాణ చేపట్టిన అభివృద్ధిని చూసి భాజపా నాయకులే దిల్లీలో మెచ్చుకుంటుంటే.. ఒకరిద్దరు కార్యకర్తలతో గల్లీలో లొల్లిచేస్తారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని భాజపా ఎంపీలకు దమ్ముంటే ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ రంగ సిమెంటు పరిశ్రమను ప్రారంభించేలా దిల్లీలో భైఠాయించాలని డిమాండ్ చేశారు. తెరాస అమలు చేసే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను భాజపా, కాంగ్రెస్ శ్రేణులు దొంగచాటుగా రాత్రి వేళల్లో తీసుకొని వెళ్తారని హరీశ్‌రావు విమర్శించారు.
త్వరలో నర్సింగ్, వైద్య కళాశాలకు సంబంధించి శుభవార్త. ప్రైవేటు ఆస్పత్రుల్లో 95 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్లు 70 నుంచి 50 శాతానికి తగ్గాయి. శనివారం సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ ప్రారంభం. రాష్ట్రంలో ఔషధాల కొరత లేదు. ఔషధాలపై అసత్య ప్రచారం చేసే వైద్యసిబ్బందిపై వేటు పడుతుంది. రాష్ట్రం ఏర్పడ్డాక వైద్య కళాశాలలు 3 నుంచి 17 కు పెరిగాయి.