ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సంక్షేమ పథకాల అమలు, సాధించిన పురోగతిపై జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీలతో కలిసి సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో మహిళల అభ్యున్నతికి మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి అధికారులకు సూచించారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు షీ-టీమ్‌ల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. సఖి కేంద్రం ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి..
మరోవైపు జిల్లాలో అక్రమ బియ్యం రవాణాను అరికట్టి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అక్రమ కలప రవాణాను అరికట్టాలని.. బాధ్యులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని పేర్కొన్నారు. పోలీసు, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కలప రవాణాను అరికట్టాలని సూచించారు. గంజాయి, గుడుంబా తయారీని అరికట్టాలని, తయారీదారులకు పునరావాసం కల్పించాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆదేశించారు.