నిర్మల్ జిల్లా కేంద్రం శివారులోని చించొలి (బి) గ్రామంలోని గండి రామన్న హరితవనాన్ని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. ఆరవ హరితహారంలో భాగంగా పార్కులో మొక్కలను నాటారు. పార్కులో గత సంవత్సరం నాటిన మొక్కలను మంత్రి పరిశీలించారు.
ప్రజారోగ్యం కోసమే.. హరితహారం : మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి - గండి రామన్న పార్కు
ఆరోగ్యమే మహాభాగ్యం అనే లక్ష్యంతో కాలుష్యాన్ని నియంత్రించి స్వచ్ఛమైన ప్రాణవాయువు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ పార్కులను ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం శివారులోని చించొలి (బి)గ్రామంలోని గండి రామన్న హరితవనం ఆక్సిజన్ పార్కును మంత్రి పరిశీలించారు.
రాష్ట్రంలోని ప్రజలు కాలుష్యం వల్ల అనారోగ్యానికి గురి కాకుండా ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందేలా ప్రభుత్వం అటవీశాఖ ద్వారా ఇప్పటివరకు 60 అర్బన్ పార్కులను ఏర్పాటు చేసిందన్నారు.. ఇప్పుడున్న గండి రామన్న హరితవనం పార్కును 600 ఎకరాల్లో విస్తరించి మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు హరితహారంలో పాల్గొని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, అటవీశాఖ అధికారులు, పలువురు డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.