లాక్‌డౌన్ వేళ వలస కూలీలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒక చోటు నుంచి మరో చోటుకి కాలినడకన వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఊర్లకు చేరుకుంటున్నా... అక్కడా వారికి అవస్థలే ఎదురవుతున్నాయి. కరోనా భయంతో గ్రామస్థులు వారిని ఊర్లోకి రానివ్వని నేపథ్యంలో... ఊరి చివర పంట చేనుల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నిర్మల్ జిల్లా కుబీరు మండలం డోడర్న తండాకు చెందిన రమేశ్, సక్కుబాయి దంపతులు తమ కుమారిడితో కలిసి ముథోల్ మండలం ఎడిబిడ్ తండాకు వలస వచ్చారు. కుమారుడు బాలాజీ కామారెడ్డి ప్రాంతంలో ఉన్న బంధువుల ఇంటికి కొద్దిరోజుల క్రితం వెళ్లి వారం రోజులపాటు అక్కడే ఉన్నాడు. కామారెడ్డి నుంచి కాలినడకన ముథోల్‌కు చేరుకున్న బాలాజీని తండావాసులు అడ్డగించారు. ఊర్లోకి రావొద్దని అభ్యంతరం తెలిపారు. చేసేది లేక బాలాజీ సహా తల్లిదండ్రులు పంట చేనులో గుడిసె వేసుకుని ఉంటున్నారు.
సరైన తాగునీరు లేదు...
వారం రోజులుగా చేనులో ఉంటూ ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. తాగేనీటికీ సైతం ఇక్కడ కష్టంగానే ఉందని వాపోతున్నారు. రాత్రి వేళల్లో ఈ అవస్థలు తీవ్రమవుతున్నాయన్నారు. స్వగ్రామమైన కుబీరు మండలం డోడర్న తండాకు వెళ్దామనుకుంటే వారూ... రావొద్దని అంటున్నారని చెబుతున్నారు.