Students Came from Ukrain: యుద్ధభూమి ఉక్రెయిన్ నుంచి మరో తెలంగాణ విద్యార్థి సురక్షితంగా తన స్వగ్రామానికి చేరుకుంది. నిర్మల్ జిల్లా కుంటాలకు చెందిన చేపూరి అలేఖ్య.. గురువారం(మార్చి 3న) రాత్రి 10 గంటలకు హైదరాబాద్ చేరుకుంది. తల్లిదండ్రులు పురుషోత్తం, శశికళ మధ్యాహ్నమే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అలేఖ్యను రిసీవ్ చేసుకున్నారు. యుద్ధం మొదలైన పది రోజుల అనంతరం.. ఎన్నో మలుపుల తర్వాత ఎట్టకేలకు స్వదేశానికి వచ్చిన అలేఖ్యను చూసి తల్లిందండ్రులు, సన్నిహితులు ఉద్వేగానికి లోనయ్యారు. నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న అలేఖ్య.. ఈరోజు ఉదయం స్వగ్రామానికి చేరుకున్నారు.
బంకర్లో తలదాచుకున్నాం..
స్వగ్రామానికి చేరుకున్న అలేఖ్యను.. నిర్మల్ జిల్లా భాజపా అధ్యక్షురాలు రమాదేవి పలకరించారు. వారితో పాటు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అలేఖ్యను కలిసి కుశలం అడిగారు. వారం రోజుల నుంచి రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుండడంతో తాన తీవ్ర ఆందోళనకు గురైనట్టు తెలిపారు. తాను ఉంటున్న ప్రాంతంలో బాంబులు పడుతుండడంతో.. హాస్టల్ కింద ఉన్న బంకర్లో తలదాచుకున్నామని.. తాము పడిన బాధలను వివరించారు. తమను క్షేమంగా ఇంటికి వచ్చేలా చేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.