నిర్మల్ జిల్లాకేంద్రంలోని బుధవారం పేటకు చెందిన నేరెళ్ల ప్రకాశ్, కృష్ణవేణికి ముగ్గురు కూతుళ్లు. స్థానికంగా చిన్నా చితకా పనులు చేసుకుంటూ ప్రకాశ్ కుటుంబాన్ని పోషించేవాడు. ముగ్గురు కూతుళ్లని మంచి చదువులు చదివించాడు. వారంతా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. పెద్దవారిద్దరికీ పెళ్లి చేశాడు. చిన్న కూతురు ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులను చూసుకుంటోంది.
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య.. అనారోగ్యమే కారణమా?
ముగ్గురు ఆడపిల్లల్ని కష్టపడి చదివించారు. తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకున్న ముగ్గురు కూతుళ్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడ్డారు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేసి సాగనంపారు. మరో కూతురు ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులను చూసుకుంటోంది. అంతా బాగుందనుకున్న సమయంలో ఆ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ వార్త తెలిసిన కుటుంబమంతా శోక సంద్రంలో మునిగిపోయింది.
ఈ మధ్య కాలంలోనే రెండో కూతురుకు కుమారుడు పుట్టాడు. మనవడు పుట్టాడని అంతా మురిసిపోయారు. కుటుంబ సభ్యులతో కలిసి దావత్ చేశారు. ఇంత ఆనందంగా సాగిపోతున్న కుటుంబంలో ఊహించని కుదుపు. ఎవరూ ఊహించని రీతిలో ప్రకాశ్ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అందరికీ ధైర్యం చెప్తూ.. స్నేహపూర్వకంగా ఉండే ప్రకాశ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అర్థం కాక కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలతోనే జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ, సభ్యులు పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య కృష్ణవేణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీనివాస్ తెలిపారు.