పట్టా పాసుపుస్తకాలు ఇప్పించండి నిర్మల్‌జిల్లా రాణాపూర్లో 50కి పైగా గిరిజన కుటుంబాలున్నాయి. వీరందరిదీ రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి.. వ్యవసాయమే జీవనాధారం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన రైతుబంధు వారికి అందని బంధు గానే ఉంది. గ్రామంలో ఉన్న వారిలో 15 కుటుంబాల వారికి ఇప్పటికీ కొత్త పట్టా పాసుపుస్తకాలు లేవు. కొంతమంది భూములు మరొకరి పేరుపై నమోదు చేశారు. ఈ కారణాలతో వారు రైతుబంధుకు దూరమయ్యారు. ఇప్పటికైనా స్పందించండి
ప్రభుత్వ సాయం అందకపోగా.. పంటరుణం కోసం బ్యాంకుకు వెళితే అక్కడా చుక్కెదురవుతోంది. బ్యాంకుల్లో పట్టాపాసుపుస్తకాలు ఇవ్వాలి. కాని వారిదగ్గరున్నవి చెల్లుబాటు కావు. నెలల తరబడి కాళ్లరిగేలా తహసీల్దారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతుబంధు అందక, బ్యాంకు సాయం లభించక సమస్య పరిష్కారం కోసం ఎవరికి విన్నవించుకోవాలో తెలియక గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ భూమికి పాసు పుస్తకాలు ఇప్పించాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి:ఆందోళనలకు సిద్ధమైన రెవెన్యూ ఉద్యోగులు