నిర్మల్ జిల్లా కుభీరు మండల కేంద్రాన్ని ఆనుకుని ప్రభుత్వ భూమి సర్వే సంఖ్య428లో 18.03 ఎకరాల పురాతన మైసమ్మ చెరువు ఉంది. దీన్ని శతాబ్దం క్రితమే గ్రామ ప్రయోజనాల కోసం నిర్మించారు. నాడు వర్షాలు సక్రమంగా కురవక చెరువు నిండక పోవడంతో దానిపై కొందరి ఆక్రమణదారుల కళ్లు పడ్డాయి. కొద్దికొద్దిగా ఆక్రమించుకొని సాగుచేసుకుంటూ వచ్చారు. తదుపరి వర్షాలు కురిసినా చెరువు నిండకుండా తూమును ధ్వంసంచేసి నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తపడ్డారు.
దురదృష్టవశాత్తు రెవెన్యూ రికార్డుల్లో ఆ సర్వే నంబరు భూమిలో.. అధికారులు చెరువు ఉన్నట్లు నమోదు చేయకపోవడాన్ని కబ్జాదారులు అవకాశంగా మార్చుకున్నారు. అక్కడ చెరువే లేనట్లు, ప్రభుత్వ భూమిలో సాగు చేసుకుంటున్నట్లు అధికారులను నమ్మించి ఏకంగా ఆ శిఖంనే పట్టా చేసుకున్నారు. రెండు దశాబ్దాల క్రితమే ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-మీరు పథకం కింద కబ్జాదారుల నుంచి దానిని స్వాధీనం చేసుకోవాలని గ్రామపంచాయతీ తీర్మానం చేసి అధికారులను కోరింది. అది గ్రామాన్ని ఆనుకున్న విలువైన భూమి కావడంతో పాటు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే ఆందోళనతో కబ్జాదారులు ముందు జాగ్రత్తగా ఏకంగా ప్లాట్లుచేసి విక్రయించేందుకు యత్నించారు.
ఈ కుతంత్రాన్ని గమనించిన గ్రామస్థులు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు. చెరువుని రక్షించాలంటూ బంద్ పాటించారు. నిరసన దీక్షలతో ఆందోళనలు చేశారు. స్పందన లేకపోవడంతో రెండేళ్ల క్రితం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. వారి మొరను ఆలకించిన న్యాయస్థానం కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకుని చెరువును రక్షించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. అయినప్పటికీ అధికారుల్లో ఎటువంటి చలనం కనిపించడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.
కబ్జాపై మరో కబ్జా: