నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అంటే చక్కని విద్యా ప్రమాణాలకు కేరాఫ్‌గా మారింది. ఏటా విద్యార్థుల సంఖ్య పెరగడమే కాకుండా అత్యుత్తమ విద్యా ప్రమాణాలు అందిస్తూ ఉత్తీర్ణతా శాతంలో దూసుకుపోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఈ కళాశాలలో చేరేందుకు వందల సంఖ్యలో విద్యార్థినిలు దరఖాస్తు చేసుకుంటారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ కళాశాలకు వసతి గృహం లేకపోవడం ఓ వెలితిలా ఉండిపోయింది.
కళాశాలలో తెలుగు, ఆంగ్లము, ఉర్దూ మాధ్యమాల్లో అన్నిరకాల మాధ్యమిక, వృత్తి విద్య కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇంతవరకు బాగున్నా తరగతి గదులు సరిపడినన్ని లేకపోవడం వల్ల ఆరుబయట చెట్ల కింద పాఠాలు చెబుతున్నారు. దూర ప్రాంత విద్యార్థినుల కోసం వసతి గృహం లేదు. ఇరుకు గదుల్లో విద్యార్థినిలు తీవ్ర ఇంబ్బంది పడుతున్నారు.