తెలంగాణ

telangana

ETV Bharat / state

చదువుల తల్లి చెంత... సమస్యల చింత

మహోన్నతమైన చరిత్ర కలిగిన చదువులతల్లి నిలయం... బాసర క్షేత్రం ... సమస్యల సత్రంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం భక్తుల పాలిట శాపమై... అమ్మవారి దర్శనానికి వచ్చే వారికి నరకప్రాయంగా మారింది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే శరన్నవరాత్రుల సమయంలోనూ అధికారుల తీరు మారలేదు.

బాసర పుణ్యక్షేత్రంలో సౌకర్యాల లేమి

By

Published : Oct 9, 2019, 5:24 AM IST

బాసర పుణ్యక్షేత్రంలో సౌకర్యాల లేమి

సుప్రసిద్ధ బాసర క్షేత్రంలో అధికారుల వ్యవహార శైలి వ్యాపార దృక్పథంగానే కనిపిస్తోంది. భక్తుల ఇబ్బందులు పట్టించుకునే వారేలేరు. ధ్యాన మందిరం దుస్థితి దయనీయంగా మారి భక్తులకు చుక్కలు చూపిస్తోంది. కనీస అవసరాలు లేకుండా ధ్యాన మందిరంలోనికి తమను పంపిస్తున్నారని భక్తులు వాపోతున్నారు.

సర్దుకుపొమ్మన్నారు...

బాసర పుణ్యక్షేత్రంలో భక్తులకు సరైన సౌకర్యాలు లేవు. తాగడానికి కనీసం మంచినీరు కూడా అందుబాటులో లేదని భక్తులు వాపోతున్నారు. మహిళలు, వృద్ధులకు సైతం మూత్రశాలలు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేస్తే... రెండ్రోజులు సర్దుకుపోండని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మా స్థానంలో వాళ్లు...

సెక్యూరిటీ నెపంతో దీక్షా పరులను ఆలయం లోపలికి రానీయకుండా నెట్టివేస్తున్నారని ఆరోపించారు. దీక్షాపరులు, స్వయంసేవకులు ఉండాల్సిన అంతర ఆలయాల్లో వ్యాపారులు, పోలీసులు ఉండటమేంటని నిలదీస్తున్నారు. స్థానికంగా ఉన్న ఉద్యోగులే ఆలయంలో విధులు నిర్వహిస్తున్నందున వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అమ్మవారి ప్రతిష్ఠ మసకబారుస్తున్నారని వాపోతున్నారు.

ప్రత్యేక దర్శనం?

నవరాత్రుల్లో ఉపవాసం ఉంటామని, అమ్మవారి దర్శనం కోసం క్యూలో గంటలు గంటలు వేచి ఉండటం తమకు ఇబ్బందిగా ఉందని దీక్షాపరులు చెబుతున్నారు. తమకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నారు.

దృష్టి సారించండి...

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. నవరాత్రి ఉత్సవాల్లో భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. కనీస సౌకర్యాలు లేక అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఇక్కట్లకు గురవుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి కనీస సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details