ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం తలపెట్టిన జనతా కర్ఫ్యూను పాటిస్తూ ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా ప్రజలందరూ స్వచ్ఛందంగా నిర్బంధం పాటించారు. మంచిర్యాల జిల్లావ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సాయంత్రం ఐదు గంటలకు జయహో భారత్ అంటూ నినాదాలు చేస్తూ చప్పట్లు కొడుతూ కరోనా నివారణకు కృషి చేస్తున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మల్ జిల్లాలో ప్రతి ఒక్కరూ కర్ఫ్యూ పాటించేలా పోలీసులు చర్యలు చేపట్టారు. పురవీధుల్లో తిరుగుతూ బయట కనిపించిన వారిని బయటకు రావద్దని.. కరోనా తీవ్రతపై అవగాహన కల్పించారు. ముథోల్లో ప్రజలు సాయంత్రం ఇంటి ముందు చప్పట్లు కొట్టి అనంతరం కులదేవతలను ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. కరోనా మహమ్మారి దేశంలో రాకూడదంటూ అమ్మవార్లను వేడుకున్నారు.