నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గణేష్ నగర్లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకునికి నిర్మల్ జిల్లా ఇంఛార్జి ఎస్పీ విష్ణు వారియర్, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. పట్టణంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఆహ్లాదకర వాతావరణంలో నిమజ్జనోత్సవం నిర్వహించుకోవాలని సూచించారు.
కొవిడ్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోన్న నేపథ్యంలో ఊరేగింపు, శోభాయాత్రలు నిర్వహించకుండా గణేశ్ నిమజ్జనోత్సవాలు జరుపుకోవాలని ఇంఛార్జ్ ఎస్పీ విష్ణు వారియర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. పట్టణంలో శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. బందోబస్తులో ఒక ఏఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 32 మంది ఎస్సైలు, 25 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 118 మంది కానిస్టేబుళ్లు, 52 మంది హోంగార్డులు పాల్గొన్నట్లు వెల్లడించారు.