నిర్మల్ జిల్లా భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ కాటన్ యార్డులో నిర్మించిన అద్దె దుకాణ గదులకు భారీ డిమాండ్ ఏర్పడింది. పట్టణంలోని ఎన్‌ఆర్ గార్డెన్స్‌లో సోమవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు ఉదయం 10గంటల నుంచి రాత్రి 7గంటల వరకు బహిరంగ వేలం పాటలు నిర్వహించారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు సామాజిక వర్గాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు గదులను కేటాయించారు. 36 కొత్తవి, 8 పాత గదులకు వేలం పాటలు నిర్వహించారు. 600 మంది వ్యాపారుల మధ్య తీవ్ర పోటీ నెలకొనడం వల్ల ఊహించని రీతిలో గరిష్ఠంగా ఓ గదికి నెలకు రూ.60 వేలు పలికింది. మిగతావి సరాసరి రూ.45 వేల వరకు పలికాయి.
నిబంధనలను తుంగలో తొక్కారు..
కరోనా నియంత్రణ గురించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అధికారులే అప్పుడప్పుడు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. కరోనా కేసులు పెరిగిపోతున్నాయని తెలిసి కూడా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో కొవిడ్ నిబంధనలు పాటించకుండా వేలం పాట నిర్వహించారు.
కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటుంటే... ప్రభుత్వ అధికారులు మాత్రం బహిరంగ వేలం పాట నిర్వహించారు. అధికారులు, దరఖాస్తుదారులు భౌతిక దూరం పాటించకుండా వేలం పాటలో పాల్గొన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ ఒకే వద్ద సాయంత్రం వరకు ఉంటే కరోనా వ్యాప్తి చెందదా అని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
ఇవీ చూడండి:కేంద్రం పూర్తి పరిహారం ఇవ్వాల్సిందే : మంత్రి హరీశ్